తిరుమల : కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుంచి ఉదయం 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు.
ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకున్నది. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేశ్ బాబు, వీజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.