విజ్ఞానం, జ్ఞానం అనేవి అల్లాహ్ మానవాళికి ప్రసాదించిన అత్యంత గొప్ప వరాలు. ఇవి మనిషి ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవితాలకు ప్రాణాధారాలు. అల్లాహ్ మూలంగా లభించే ఈ జ్ఞానాన్ని ఆర్జించే విశ్వాసులకు ఇహ పరలోకాల్లో ఉన్నతమైన అంతస్తులు లభిస్తాయి. అయితే, కేవలం పుస్తక పఠనం మనిషిని పండితుడిగా మార్చదు; దైవభీతి, వినయం కలిగిన వారే నిజమైన జ్ఞానులు. జ్ఞానం పెరిగే కొద్దీ మనలో భక్తి విశ్వాసాలు పరిమళించాలి. దైవ ప్రవక్త (సల్లం) బోధించినట్లు, అల్లాహ్ ఎవరికైనా మేలు చేయాలనుకుంటే వారికి ధర్మంపై అవగాహనను ప్రసాదిస్తాడు, జ్ఞాన మార్గంలో నడిచే వారికి స్వర్గ మార్గాన్ని సుగమం చేస్తాడు.
ఖురాన్, హదీసుల అంతరార్థాన్ని గ్రహించిన వివేకవంతులు సమాజంలో సరైన తీర్పులు ఇస్తూ, ప్రజల ధర్మ సందేహాలను తీర్చాలి; లేకపోతే ప్రళయ దినాన వారు కఠిన జవాబుదారీతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అల్లాహ్ అందించిన జ్ఞానం నేలపై కురిసే వర్షం వంటిది, అది ఎండిన భూమిని పచ్చదనంతో మురిపించినట్లుగా, మనిషిలో మంచి-చెడులను గుర్తించే విచక్షణను నింపుతుంది. ఇతరులకు విద్యను నేర్పడం, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా లభించే పుణ్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. జ్ఞాన సముపార్జనలో ఉన్న ప్రతీ వ్యక్తి దైవ మార్గంలో ఉన్నట్లుగా పరిగణనలోకి వస్తారు.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076