ప్రముఖ ఇస్లామిక్ తత్వవేత్త అల్ ఖ్వారిజిమీ చెప్పిన సూత్రం ఏమిటంటే.. ‘మీ దగ్గర నీతి, నడవడికలుంటే 1 మార్కు. నైతికతతోపాటు అందమూ ఉంటే ఆ ఒకటికి ఒక సున్నా చేర్చండి, 10. నైతికత, అందంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటే మరో సున్నా చేర్చండి, 100. నైతికత, అందం, డబ్బుతోపాటు అమ్మానాన్న, బంధుగణమూ ఉంటే మరో సున్నా చేర్చండి, 1000. అన్నీ ఉండి కూడా మీలో నైతికత లోపిస్తే.. ముందున్న ఒకటి తొలగించండి, 000’ అని మనిషి వ్యక్తిత్వాన్ని గురించి సూత్రీకరించాడు.
మనిషిలో నైతికత లేకపోతే అలాంటి వ్యక్తిత్వం శూన్యమన్నారు ఖ్వారిజిమీ. ఇస్లామ్ ధర్మం నైతికతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. నమాజు ఐదు పూటలు విధిగా చేయాల్సి ఉంటుంది. కానీ, నైతికత 24 గంటలూ ఆచరించాలని ఉలేమాల బోధన. నైతికత లోపించినప్పుడు ఎన్నెన్ని నమాజులు, ఉపవాసాలు, మరెన్ని దానధర్మాలు చేసినా అల్లాహ్ ఆమోదించడు. ఇరుగు పొరుగు వారిని దుర్భాషలాడుతూ… వేళకు నమాజులు చేసినా అవి అల్లాహ్ స్వీకృతి పొందవు అన్నారు ప్రవక్త. మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దారి చూపే ఆచరణే నైతికత.
మనిషి నైతికతపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. నైతికతను పెంచుకోవడానికి జ్ఞానార్జన అవసరం. అలాంటి జ్ఞానాన్ని ఇస్లాం బోధిస్తుంది. సత్ప్రవర్తన, పవిత్రత కలిగి, అవసరమైన వారికి చేతనైన సాయం చేయాలన్నది ఖురాన్ బోధనల సారాంశం. ఆర్థిక సంయమనం ప్రతి మనిషికి చాలా అవసరమని… ఎవరినీ అతిగా అనుమానించకూడదన్నది ప్రవక్త హితబోధ. ఇతరులపై కారణం లేకుండా నిందలు వేయకూడదు, వారి గురించి చెడుగా మాట్లాడకూడదన్నదీ ప్రవక్త ఉద్బోధ. మన కర్మలకు మనం జవాబుదారీగా ఉండాలనీ, నైతికతకు బలమైన పునాది అయిన ధైర్యాన్ని జీవితంలో ఎప్పుడూ కోల్పోకూడదనీ ఖురాన్ గుర్తుచేస్తుంటుంది.
– ముహమ్మద్ ముజాహిద్
96406 22076