ధర్మశాస్ర్తాలకు నిఘంటువు అయిన ‘మహాభారతం’లో ధృతరాష్ట్రునితో విదురుడు.. ‘ఊరికే గొప్పలు చెప్పుకుంటూ బతకడం, అయిన దానికీ- కాని దానికీ చీటికి- మాటికి కోపంతో రెచ్చిపోవడం, ఎంత సంపద ఉన్నా తృప్తి అనేదే లేకుండా గడపడం, పనీ పాటా లేకుండా తిరుగుతుండటం, పొగరుతో ఎవరినీ లెక్క చేయకుండా కన్నూమిన్నూ గానకుండా ప్రవర్తించడం వంటి అవలక్షణాలు ఉన్న దుర్మార్గులకు ఏ సమాజంలోనూ ఎన్నటికీ విలువ ఉండదు. వాళ్ల దుడుకుచేష్టలకు ఎవరైనా భయపడినట్టు కనిపించినా అది అప్పటికి మాత్రమే’ అని చెప్పిన మాటలివి.. అలాంటివాళ్లకు కాలమే గుణపాఠం చెపుతుంది.
మంచి ఆలోచనలు ఉండే ఉత్తములకు మాట్లాడే తీరు, మాటలూ చేతలుకూడా ఆదర్శవంతంగా, గొప్పగానే ఉంటాయి. అలాంటివారే ఉత్తములు. వాళ్లకే సంఘంలో విలువ ఉంటుంది. ఎప్పుడూ వాళ్ల గౌరవం పెరుగుతూనే ఉంటుంది తప్ప, ఎన్నటికీ తరిగిపోదు. ‘ఎప్పుడూ ఎవరినీ నొప్పించకుండా, ఇతరులకు ఏ హానీ చేయకుండా స్వపర భేదాలకుగానీ, సుఖదుఃఖాలకుగానీ తావివ్వకుండా మెలగుతూ ఉండేవాళ్లే ఉత్తములని’ మన ధర్మశాస్ర్తాలు ఘోషిస్తున్నాయి.