తిరుమల : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam ) కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఒకవైపు స్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుండగా మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ( Cultural Programs) భక్తులను కనువిందు చేస్తున్నాయి.
ఉత్సవాల సందర్భంగా శ్రీవారు ఆదివారం మోహిని అవతారంలో దర్శనమివ్వగా మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 26 కళా బృందాలలో మొత్తం 568 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో వాహన సేవ శోభను మరింత ఇనుమడింపజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, పుదుచ్చేరి, చత్తీస్గఢ్ , మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడుకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. కేరళకు చెందిన కళాకారులు ప్రదర్శించిన మోహినీ అట్టం, గోపికానృత్యం, తిరువథారకలి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కర్ణాటకకు చెందిన మోహినీ భస్మాసుర యక్షగానం, దాసవాణి నృత్యవైభవం, రాజస్థాన్ నుంచి కల్బెలియా నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి బదాయ్, గిరిజన జానపద నృత్యాలు, చత్తీస్గఢ్ నుంచి ప్రరవ్ పూజ, పంజాబ్ నుంచి బంగ్రా వంటి వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే కళా రూపాలు ప్రదర్శించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన ధింసా, కిట్టయ్య లీలలు, దమరుక ధ్వని విన్యాసం, చెక్క భజన వంటి సాంప్రదాయ కళలు వాహన సేవకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి.