Holi | హోలీ పండుగ వచ్చిందంటే యువకులు, పిల్లలు, మహిళలు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆడపడుచుల ఆటపాటలు, చిన్న పిల్లల జాజర ఆట పాటలతో గ్రామాలు మార్మోగుతుంటాయి. పండుగల్లో హోలీకి విశిష్టమైన స్థానం ఉంది. వసంత రుతువు ఆగమనానికి చిహ్నం ఈ పండుగ. ఈ రుతువులోనే చెట్ల ఆకులు రాలి కొత్త ఆకులు వస్తాయి. ప్రేమానురాగాలకు ప్రతీకగా, నూతన ఒరవడిని గుర్తు చేస్తూ వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది.
వైష్ణవములో రాక్షసరాజు హిరణ్యకశపుడు.. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చకపోవడంతో భక్త ప్రహ్లాదుడిని చంపాలని అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలిచి.. ఆమెకు ఉన్నశక్తితో భక్త ప్రహ్లాదుడిని మంటలతో ఆహుతి చేయమని కోరతాడు. దీంతో ఆమె భక్త ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో భక్త ప్రహ్లాదుడు బయటపడతాడు.. హోలిక రాక్షసి మాత్రం మంటల్లో చిక్కుకొని చనిపోతుంది. ఇక ఆమె దహనమైన రోజునే హోలీ పండుగగా పిలుస్తారని ప్రచారంలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో హోలిక దహనం చేస్తుంటారు.
హోలీ పండుగను మన రాష్ట్రంలో రెండు రోజుల పాటు జరుపుకొంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజు ముందుగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం పండితులు నిర్ణయించిన తేదీ ప్రకారం వేడుకలు నిర్వహిస్తారు. గ్రామ దేవత అయిన సార్గమ్మ ఉండే గ్రామాల్లో కామదాహనం, హోలీ పండుగను ఒకరోజు ముందుగానే జరపడం ఆనవాయితీగా వస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోలలు(కర్రలు) పట్టుకొని చిన్నారుల బృందం ఊరంతా తిరుగుతూ పాటలు పాడి విరాళాలను సేకరిస్తారు. వచ్చిన ఆ డబ్బులతో హోలీనాడు కావాల్సిన రంగులు తెచ్చుకొని సంబురాలు చేసుకుంటారు. మహిళలు ఇంటింటికీ తిరుగుతూ హోలీ పాటలు పాడుకుంటూ ఇనాం అడుగుతూ సందడి చేసేవారు. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు.
సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు.
హోలీ రోజు రసాయనిక రంగుల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ రసాయనాల ప్రభావంతో చర్మ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇవి నేరుగా కండ్లలో పడితే కళ్లు ఎరుపె క్కడం, అంధత్వం బారిన పడే ప్రమాదం ఉంది. అస్తమా, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రసాయనాలు కలిపిన రంగులతో హోలీ ఆడితే శరీరంపై ఎక్కువ సేపు ఉండనీయకుండా చల్లని నీటితో సాధ్యమైనంత తొందరగా శుభ్రం చేసుకోవాలి. హోలీ ఆడడానికి ముందు ముఖానికి మాయిశ్చరైజ్, తలకు నూనె రాసుకోవడం ద్వారా రంగులు శరీరంలోకి ఇంకవు.
హోలీ పండుగ రోజు సహజ రంగులను వాడడం ఉత్తమం. చిన్నపిల్లలను రసాయనిక రంగులకు దూరంగా ఉంచాలి. సహజ సిద్ధమైన పర్యావరణ హితమైన రంగులు చల్లుకుంటే మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా దొరికే మోదుగు పూలను తెంపి నీళ్లలో వేసి ఉడికించి రంగును తయారు చేసి ఇవ్వాలి. ఈ రంగు నీళ్లు వాడడంతో శరీరానికి ఎంతో ఉపయోగకరంగా, ఆయుర్వేదంగా పని చేస్తాయి. వీటితో పాటు బుక్కా, గులాల్, పసుపును వాడితే బాగుంటుంది.
– చందూర్,