కథాసుధ
ఓ యువ అధ్యాపక దంపతులకు ఒక్కగానొక్క మగబిడ్డ కలిగాడు. ఆ పిల్లవాడిని తమకన్నా పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. పిల్లాడు పసివాడుగా ఉన్నప్పుడే అంతర్జాతీయస్థాయి విశ్వవిద్యాలయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అక్కడి ఉపాధ్యాయుల నేపథ్యం, కోర్సుల ప్రత్యేకతలు, అక్కడ చదివి గొప్ప స్థానాల్లో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు. కొడుకు ఆ విశ్వవిద్యాలయాల్లో చదివే వయసుకు వచ్చేసరికి ఎంత డబ్బు కావాల్సి వస్తుందో లెక్కలేశారు.
తమ దగ్గర ఉన్న వనరుల జాబితా చూసుకున్నారు. మరెంత కూడబెట్టాలో ఆలోచించసాగారు. మనవడిని చూడటానికి వచ్చిన అధ్యాపకుడి తల్లికి తన కొడుకు, కోడలి వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగింది. ‘ఎందుకు ఇంతలా ఇదైపోతున్నారు?’ అని అడిగింది. విషయం చెప్పారు దంపతులు. ఆమె మనవడిని చేతిలోకి తీసుకుంటూ ‘తల్లిని మించిన దైవం లేదని పెద్దలు ఎప్పుడో చెప్పారు.
అలాగే తల్లి ఒడికి మించిన గొప్ప విశ్వవిద్యాలయం ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు. ప్రేమ, అనురాగం, బుజ్జగింపు, ఆప్యాయత, మమకారం ఇవన్నీ ప్రధానం. అప్పుడే పై చదువుల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి గురికావద్దు. వాడిని ఒత్తిడికి గురిచేయవద్దు. ముందుగా బిడ్డకు స్వచ్ఛమైన బాల్యాన్ని ఇవ్వాలి. అది అమ్మతోనే సాధ్యం’ అని సలహా ఇచ్చింది. ‘నిజమే… తల్లి ఒడే ఓ పెద్ద విశ్వవిద్యాలయం. దైవం ప్రసాదించిన ఆలయం. ఇక్కడ నేర్చుకునేది మనిషి జీవితానికి తొలిమెట్టు అవుతుంది. అది లోపిస్తేనే సమస్యలు ఎదురవుతాయి’ అని గుర్తించి బిడ్డను ముద్దులాడారు ఆ ఉపాధ్యాయ తల్లిదండ్రులు.
ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821