త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామఃక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్!
(భగవద్గీత 16- 21)
‘అర్జునా! కామక్రోధ లోభాలనే మూడు నరకానికి ద్వారాలు. అవి ఆత్మనాశన హేతువులు. అంటే మానవుని అధోగతి పాలుచేసేవి. కాబట్టి ఆ మూడింటిని త్యజించాలి’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. మానవులకు కామం (కోరికలు) సహజం. అవసరాలు పరిమితాలు, కోరికలు అపరిమితాలు. కోరికలు తీరకపోతే క్రోధం, దానినుంచి లోభం, లోభం నుంచి మోహం, మోహం నుంచి మదం, దాన్నుంచి మాత్సర్యం వెలుగుచూస్తాయి. వీటిని ఆసురీ ప్రవృత్తులుగా చెబుతారు. నిరంతర వేదనామయ జీవితానికి ఇవి మూలకారకాలు. కాబట్టి వీటిని నరక ద్వారాలని అంటారు.
భాగవతంలో గజేంద్రమోక్షణ గాథ ఉన్నది. గజరాజు తన భార్యలతో ఒక సరోవరంలో జలక్రీడలు ఆడుతుండగా మొసలి దానిని పట్టుకుంటుంది. తన భౌతిక శక్తిసామర్థ్యాలతో మొసలిని జయించలేని గజరాజు విష్ణువును ప్రార్థించగా.. విష్ణువు మొసలిని సంహరించి గజరాజును రక్షిస్తాడు. గజరాజు అనేది మనసును ఆవరించిన కోరికలకు ప్రతీక. అపరిమితమైన కోరికలు ఒకదాని వెంట మరొకటి చెలరేగగా వాటిని సంతృప్తి పరచలేక/ జయించలేక, నిస్సహాయత, కోపంలాంటి నకారాత్మక భావనలు అశాంతికి గురిచేయగా.. ఆ సమస్య పరిష్కారానికై తీవ్రంగా ప్రయత్నించాడు. తీవ్రమైన కోరికల ఉధృతివల్ల ‘మొసలి’ అనే బంధనాలలో చిక్కాడు. కోరికల వలయంలో చిక్కిన తాను వాటిని జయించలేనన్న సత్యాన్ని అవగతం చేసుకున్న గజరాజు, సంఘర్షణ పరిష్కారాన్ని చూపదనే ‘యెఱుకను’ పొంది మరొకరి సహాయానికై ప్రార్థించాడు. సంఘర్షణ పరిష్కారాన్నివ్వదు. విశ్వాసంతో కూడిన సంస్కారం, శక్తిసామర్థ్యాల సంపూర్ణ వినియోగం మాత్రమే సమస్యలను పరిష్కరిస్తుంది. విశ్వాసం విష్ణువుకు ప్రతీక.
గజరాజు ఆ సందర్భంలో తనను తానొక బాధితునిగానూ, మొసలిని దుర్మార్గురాలిగానూ భావించాడు. నిజానికి గజరాజు బాధితుడూ కాడు, మొసలి దుర్మార్గురాలూ కాదు. తానొక గజరాజుననే అహంకారం, తనకందరూ భయపడతారనే భావన అతనిలో ఆభిజాత్యాన్ని పెంచింది. తన ప్రయత్నంలో గెలిస్తే తానొక ఉదాత్త చరిత్రుడయ్యేవాడు.. ఓడితే అమరవీరుడయ్యేవాడు. ఈ రెండూ నిజానికి మాయ, మోహ, మద భావనలకు సంబంధించినవే. అయితే.. ఆ భావనల పరిమితులను అధిగమించి, విశ్వాసంతో విష్ణువు సహాయానికై ప్రార్థించాడు.
నిజానికి అన్ని సమస్యలను మనమే పరిష్కరించుకోగలమనే నమ్మకంతో బాధ్యతను తీసుకుంటాం. పరిష్కారాలకై పరిశ్రమిస్తాం. జయాపజయాలు సంభవిస్తాయి. పొంగిపోయినా, కుంగిపోయినా వ్యక్తిత్వంపై మరకపడుతుంది. సముద్రంలో అలలు తీరాన్ని తాకి తిరిగి సముద్రంలోకి ఎలాగైతే వెళ్లిపోతాయో… అలాగే సమస్యలు చుట్టుముడుతాయి, కాలాంతరంలో తొలగిపోతాయి. పరిష్కరించుకోగలిగిన వాటిని పరిష్కరించుకోవడం.. సాధ్యపడని వాటిని విశ్వాసంతో భగవంతుడికి అప్పగించడం విజ్ఞత.
యాంత్రికమైన ప్రక్రియలతో ఒక్కోసారి ఫలితాలు రావచ్చు. కాని అవి అస్థిరమైనవే. ఆకర్షణ వలయంలో విశ్వాసంతో సాధించిన ఫలితాలే స్థిరంగా నిలుస్తాయి. విశ్రాంతమైన శరీరంతో, సంఘర్షణను పొందని మనసుతో, ఏకాగ్రమైన దృష్టితో చేసిన సాధన నరక ద్వారాలకు దూరం చేస్తుంది. కోరికలు ఒక విష వలయంలాగా మనలో నిండిపోతాయి. వాటిని అదుపు చేసుకోగలగడం సాధన. మానవ ప్రయత్నం సరిపోని సమయంలో భగవంతుడి సహాయానికై ప్రార్థించడమూ సమంజసమే. అయితే వాటిలో ఏవి అవసరమో ఏవికావో తెలుసుకోవడం విజ్ఞత. మనం కోరిన కోరికలు భగవంతుడు తీరుస్తే అద్భుతమని భావిస్తాం. మనలాగే భగవంతుడూ మనలను కోరుకుంటాడు.. ఆ కోరికలను మనం తీర్చగలిగితే అదీ అద్భుతమే. యాంత్రిక వలయంలో జీవించే మానవులకు భయం కారణంగా కామమనేది జనిస్తుంది. మూలకారణమైన కోరికలను అదుపు చేయగలిగితే.. యాంత్రిక వలయం నుంచి భగవంతుడి ఆకర్షక వలయంలోకి చేరుకుంటాం. సత్యాన్ని దర్శించగలుగుతాం.