నేటికీ నాటకం ఆచరణీయమే
సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ, ప్రహసన, డిమ, వ్యాయోగ, సమవాకార, వీథి, అంక, ఈహామృగ వంటి దశ రూపకాలలో నాటకం ఉత్తమమైనది.
సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ, ప్రహసన, డిమ, వ్యాయోగ, సమవాకార, వీథి, అంక, ఈహామృగ వంటి దశ రూపకాలలో నాటకం ఉత్తమమైనది. శ్రవణ సహిత దృశ్య రూపకం నాటకం.
కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే అని చెప్పవచ్చును. అయితే క్రీడాభిరామంలో నాటక లక్షణాలు లేవని కొందరంటారు. మహా పండితులు చెప్పిన నాటక లక్షణాలు సమస్తం అనుసరిస్తూ నాటకం వ్రాయడం, ప్రదర్శించడంలో తప్పులేదు కానీ భాస మహాకవి వంటి వారు వ్రాసిన ‘ఊరు భంగం’, ‘దూత వాక్యం’, ‘కర్ణ భారం’, ‘దూత ఘటోత్కచం’, ‘పాంచరాత్రం’, ‘అవిమారకం’, ‘స్వప్న వాసవదత్తము’ వంటి రచనలలో నాటక లక్షణాలు సమస్తం ఉండవు అని కొందరు పండితులు అంటారు.
నాటకంలో పదిమందిని ఆకర్షించే సన్నివేశాలు, చక్కని సంభాషణలు, ఆకర్షణీయమైన సంగీతంతో కూడుకున్న పద్యాలు, పాటలు, రంగస్థలంపై ఉన్న నటుల నటన పదిమందిని ఆకర్షిస్తే అలాంటి నాటకాలన్నీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. అప్పుడు పండితులు చెప్పిన నాటక లక్షణాలు లెక్కలోకి రావు. నిజం చెప్పాలంటే పండితుల నాటక లక్షణాలకు ప్రజాదరణ పొందిన నాటక లక్షణాలకు సంబంధం ఉండదు..
నాటక లక్షణాలలో నాయకుడు ఉత్తముడై ఉండాలి అంటారు. దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి నాయకులు ఉత్తములా? అంటే ఎవరి అభిప్రాయం వారిది. ఎవరు ఉత్తములు? ఎవరు మధ్యములు? ఎవరు అధములు? అనే చర్చోపచర్చలు మహా పండితుల నడుమ సాగుతుంటాయి. ఎక్కువ శాతం, నాటక ప్రజాదరణ, పండితుల చర్చోపచర్చలకు భిన్నంగా ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు తెలుగు నాటకాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి. తెలుగు తొలి నాటకం 1860 ప్రాంతాన కోరాడ రామచంద్రశాస్త్రి గారు వ్రాసిన ‘మంజరీ మధుకరీయం’ అని నాటక చరిత్రకారులు చెబుతున్నారు. తెలుగులో అభిజ్ఞాన శాకుంతలం, నరకాసుర విజయం, వేణీ సంహారము, గయోపాఖ్యానం, ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం, పాదుకా పట్టాభిషేకం, హరిశ్చంద్ర, పాండవోద్యోగ విజయాలు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, ప్రమీలార్జునీయం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం, లవకుశ, భక్త రామదాసు, భక్త ప్రహ్లాద, సతీ అనసూయ, సతీ సావిత్రి, చింతామణి, వరవిక్రయం, నర్తనశాల, శ్రీమత్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, కురుక్షేత్రం, మాభూమి, కీర్తి శేషులు, రంగూన్ రౌడీ, వసంతసేన, వంటి తెలుగు నాటకాలు ఒకప్పుడు దేశవిదేశాల్లోని అనేక రంగస్థలాలకు వన్నె తెచ్చా యి. ఒక లెక్క ప్రకారం తెలుగులో పౌరాణిక చారిత్రక సాంఘిక జానపదాది నాటకాలు రమారమి నాలుగు వేల పైనే అన్న మాటల్లో ఆవంత కూడా అతిశయోక్తి లేదు.
రామాయణ, భారత, భాగవతాదులలో కూడా లేని సంఘటనలు మన తెలుగు పౌరాణిక నాటకాలలో ఉన్నాయి. ఆ కల్పిత సంఘటనలే నిజమన్న సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. ఒకప్పుడు తెలుగు నాటకాలకు అంత శక్తి ఉంది.
శ్రీరామాంజనేయ యుద్ధం, శశిరేఖా పరిణయం, సీత అగ్నిప్రవేశం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు, శ్రీరామ శంబూకుల యుద్ధం, కర్ణుని నాయక తేజం వంటి అనేకానేక అంశాలు రామాయణ భారతభాగవ తాదులలో వేరే రకంగా ఉంటాయి. భాగవత పురాణం లో హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అన్నట్లు ఉండ దు. కానీ మన తెలుగు నాటకాలు అనేకానేక పురాణ పాత్రలను మహోన్నత నాయకులుగా తీర్చిదిద్దాయి. ఈ పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలే తర్వాత తర్వాత సినిమాలుగా వచ్చాయి. ఆ సినిమాలు కూడా అధిక శాతం విజయవంతమయ్యాయి.
కొన్ని కొన్ని తెలుగు సాంఘిక సినిమాలలో పౌరాణిక జానపద చారిత్రక ఛాయలు ఉంటాయి. ఉదాహరణకు భాసుని స్వప్న వాసవదత్త నాటకమున వాసవదత్త అవంతిక పేరుతో పద్మావతి దగ్గర ఉంటుం ది. ఆమెను పద్మావతీ దేవి దగ్గరకు మంత్రి యౌగంధరాయణుడు తీసుకువస్తాడు. ఆ సంఘటన ఛాయయే సంప్రదాయం అనే తెలుగు సినిమా మూల కథ అనిపిస్తుంది. ఇలాంటి ఛాయలు మన తెలుగు సినిమాలలో చాలా కనపడతాయి. అలాగే శ్రీకృష్ణ తులాభారం కథాఛాయ శుభలగ్నం అనే సాంఘిక సినిమాలో కనపడుతుంది. శమంతకమణి పౌరాణిక వృత్తాంతానికి ఛాయారూపంగా ఎన్.టి.ఆర్. వేటగాడు సినిమా ఉంటుంది. ఇలా పౌరాణికాది కథల ఛాయతో సాంఘిక సినిమాలు రావడం తప్పు కాదు. అయితే పౌరాణిక పాత్రల ఔచిత్యం దెబ్బ తినేటట్లు పౌరాణిక సినిమాలు రావడం మాత్రం మంచిది కాదు. నేడు తెలుగునాట దుష్ట చతుష్టయం లోని ఒకడైన కర్ణుడు కొందరికి నాయకుడుగా కనపడతాడు. నిజానికి వ్యాస భారతం చదివితే ఆ భావన రాదు. పౌరాణిక పాత్రల గుణగణాలను లెక్క కట్టేటప్పుడు యుగధర్మా దులన్నీ గమనించాలి. వ్యాస భగవానుడు ఆ పని చేసాడు. కలియుగ నాటక రచయితలు, సినిమా రచయిత లు ఆ పని చేయలేదు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పౌరాణిక కథా పరిధులు పెరిగిన ఆధునిక కాలంలో, స్వయంప్రభ, ప్రమధ్వర, ఉలూక రాయబారం వంటి పౌరాణిక నాటికలు, బాసర సరస్వతి చరిత్ర, శ్రీ కాళేశ్వర క్షేత్రమహిమ, ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య ,శ్రీనివాస రామానుజన్, మహావీరాచార్య, బ్రహ్మగుప్త వంటి నాటికలు అక్కడక్కడ ప్రభుత్వేతర పాఠశాలల్లో విద్యార్థుల చేత ప్రదర్శింపబడుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పటి తెలుగు నాటకాల ప్రదర్శనల్లా ఇప్పుడు తెలుగు నాటక ప్రదర్శనలు ఉండటం లేదన్నది నిజం.
అక్కడక్కడ కొన్ని నాటక పరిషత్తుల వారు నాటక పోటీలను ప్రోత్సహిస్తూ, వర్తమాన సాంఘిక నాటకా లకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. కొత్తగా ఆలోచించలేక పోతున్నారు. నేడు నాటకాలకు ఆదరణ కరువైంది. అయితే ఆయా సాంస్కృ తిక ప్రదర్శనలు అధికశాతం సినిమా పాటలకు , షోకేస్ బొమ్మల్లా విద్యార్థులను తయారు చేయడానికి పరిమితం అవ్వడం విచారించవలసిన విషయం. విద్యార్థులతో శాస్త్ర సాంకేతిక పౌరాణిక విజ్ఞాన తెలుగు నాటికలను ప్రదర్శింప చేయడం వలన విద్యార్థులలో తెలుగు భాషా ఉచ్చారణ సామర్థ్యం పెరుగుతుంది. భాషపై పట్టు వస్తుంది. విషయ అవగాహన మీద పట్టు పెరుగుతుంది. బట్టీ తత్వం తగ్గి పరిశోధనా తత్వం పెరుగుతుంది. మన భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిధులను తెలుగు నాటికల ద్వారా పెంచవచ్చును. అప్పుడు భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రయోగశాలల వైపు పయనమవుతుంది. ఇలా చేయగలిగితే మన తెలుగు నాటక తేజం శాస్త్రీయ పథాన వికసిస్తుంది.
తెలుగు నాట ఒకప్పుడు పౌరాణిక నాటకాల కథాంశాలే అసలు రామాయణ, భారత, భాగవతాదులలోని కథాంశాలు అనుకుంటే, ఆ తర్వాత పౌరాణిక సినిమాలే అసలు రామాయణ, భారత, భాగవతాదులలో కథాంశాలు అని అధికశాతం తెలుగువారు అనుకునే వారు. నేడు పౌరాణిక సినిమాల ప్రభావం తగ్గిపోయింది. ఏదేమైనా పౌరాణిక సినిమా నాలెడ్జే పురాణ నాలెడ్జ్ అని పొంగి పోవడం అశాస్త్రీయం అవుతుంది.
వాగుమూడి
లక్ష్మీ రాఘవరావు
62814 90160
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

