మానవ దేహం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలతో, 72 వేల నాడులతోపాటు మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం అనే ఏడు ప్రధాన చక్రాలే కాకుండా అనేక ఉపచక్రాలతో ఏర్పాటైంది. వీటన్నిటిని చైతన్య పరచుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అందుకు యోగసాధనే అసలైన మార్గం. అష్టాంగయోగంతో పూర్వం రుషులు అష్టసిద్ధులనూ సాధించారు.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను దర్శించగలిగారు. అంతరిక్షంలో జరిగే అద్భుతాలను, గ్రహ గతులను వీక్షించగలిగారు. సామాన్య మానవుడూ ఈ అద్భుతాలను సాధించగలడు. అందుకు సద్గురువు మార్గదర్శకత్వంలో యోగాన్ని సాధన చేయాలి. యోగం వల్ల కలిగే లాభాలు అనేకం. అంతిమ ప్రయోజనం జన్మరాహిత్యం.