మనల్ని వెలుగులో ఉంచేది సత్త్వగుణం. కోర్కెల వెంట ఉరకలేయించేది రజోగుణం. అజ్ఞానాంధకారంలో ముంచేది తమోగుణం. ఈ విషయాలను భగవద్గీత స్పష్టం చేసింది. ఇంతకు ఈ సత్త్వరజస్తమో గుణాలు ఎక్కడివి? ఇవి ప్రాకృతిక గుణాలు. సత్త్వం, రజస్సు, తమస్సు ఈ మూడుగుణాల సామ్యావస్థకే ప్రకృతి అని పేరు.
ప్రకృతిలోని ఈ గుణాలే పాంచభౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రకృతి కారణంగా ఏర్పడిన ప్రపంచం అంతటా ఈ మూడు గుణాల విశృంఖలత్వమే కనిపిస్తుంది. అంతేకాదు మన శరీరంలో ఈ త్రిగుణాలు తిష్ఠవేసుకొని మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ద్వంద్వాలకు లోనుచేస్తాయి. సామాన్యులు ఈ త్రిగుణాత్మక జగత్తులోపడి క్రీడిస్తుంటారు. కానీ, యోగులు త్రిగుణాతీతులై ఉంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో పలికిన మాటలు ఆలోచింపదగినవి..
‘త్రైగుణ్య విషయా వేదా నిైస్త్రెగుణ్యోభవార్జ్జున
నిర్దంద్వో నిత్యసత్తస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్
(సాంఖ్యయోగం-45)
‘వేదాలు పదేపదే ఈ మూడుగుణాల గురించి చెబుతుంటాయి. కానీ, ఓ అర్జునా! నీవు త్రిగుణాతీతుడవు కావాలి!’ అని కృష్ణుడి సందేశం.
మనం ఎప్పుడైతే త్రిగుణాలతో బంధితులం అవుతామో అప్పుడు రాగద్వేషాలకు లోనవుతాం. రాగద్వేషాలకు లోనైనప్పుడు హర్షం, శోకం కలుగుతాయి. ఈ హర్షశోకాలను ద్వంద్వాలుగా పరిగణిస్తారు. మానావమానాలు, జయాపజయాలు, శీతోష్ణాలు, జననమరణాలు ఇవన్నీ ద్వంద్వాలే. వీటిలో కొట్టుకొని పోవద్దని, నిరంతరం పరమాత్మలోనే స్థితి కలిగి ఉండాలని, తన యోగక్షేమాలే ముఖ్యం కావని, ఆత్మజ్ఞానంతో వెలిగిపోవాలని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు యోగమార్గంలో నడిచేవారికి శిరోధార్యమని చెప్పక తప్పదు.
ఈ సమస్త ద్వంద్వాలకు మూలం ప్రపంచం. మనం ద్వంద్వ ప్రవృత్తికి అలవాటుపడినంత కాలం జ్ఞానోన్ముఖులం కాలేం. అందుకే ఏవి ద్వంద్వాలో తెలుసుకొని వాటినుంచి బయటపడే మార్గాన్ని చూసుకోవాలి. మనం ఒక పని చేసినప్పుడు అది ఫలవంతమైతే సుఖం కలుగుతుంది. సుఖాన్ని ఇష్టపడనివారు లేరు. ఇంకా సుఖం కావాలని అందుకు తగిన పనుల్లో నిమగ్నమవుతాం. ఒకవేళ ఒకపని చేసినప్పుడు ఆ పని ఫలవంతం కాకపోతే కోపం వస్తుంది. దుఃఖం కలుగుతుంది. పనిమీద అసహ్యం పెరిగి, అందుకు కారణమైన వ్యక్తుల మీద పగ పెంచుకొని నిరంతరం క్రోధాత్ములమై ఉంటాం. కోరికలు పెంచుకొని అవి తీరక క్రోధానికి లోనైనప్పుడు మనల్ని తమోగుణం ఆవరిస్తుంది. తమస్సు బుద్ధిని సరిగా పనిచేయనీయదు. అందుకే కృష్ణుడు, ఆలోచనాశక్తి నశించినప్పుడు మనిషి తానున్న స్థితి నుంచి పతనమవుతాడని హెచ్చరిస్తాడు. (బుద్ధినాశాత్ ప్రణశ్యతి- సాంఖ్యం, 63)
ఈ ద్వంద్వాల నుంచి బయటపడాలంటే, ఇంద్రియ నిగ్రహమే అందుకు తగిన పరిష్కారం. అంతఃకరణం (మనసు) అదుపులో ఉంటే మన ఇంద్రియాలు విషయాల వెంటపడవు. శబ్దస్పర్శరసగంధాలే విషయాలు. ఇవి మనల్ని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తుంటాయి. ఒక విధంగా ఈ ప్రపంచమంతా అయస్కాంతం లాగా మనల్ని ఆకర్షిస్తుంటుంది. జ్ఞానులు ఈ ఆకర్షణకు లోనుకారు. దానికి కారణం ఈ ప్రపంచం త్రిగుణాత్మకమైనదన్న జ్ఞానం వారికి ఉండటమే! కాబట్టి, ద్వంద్వాలలో చిక్కి జన్మపరంపరకు తావీయరు.
జనన మరణాలు కూడా ద్వంద్వం కిందికే వస్తాయి. జీవునికి ఇవి తప్పవు. ఎలాగూ తప్పవని జననమరణ వలయంలో చిక్కుకుపోవడమేనా? ఆత్మకు చావు లేదు. నిజానికి ఆత్మ పుట్టిందికాదు. భగవంతుని వలె ఉనికి గలిగిన పదార్థమే. ఈ చావుపుట్టుకలు శరీరానికే కాని, ఆత్మకు కావని తెలుసుకోవాలి. ఆత్మ శాశ్వతమైనప్పుడు, శాశ్వతం
కాని ప్రపంచం కన్నా, శాశ్వతమైనదేదో దాన్ని
ఆశ్రయించాలి. ప్రపంచాన్ని ఆశ్రయించినంత కాలం జనన మరణాలు తప్పవు. భగవంతుణ్ని ఆశ్రయిస్తే జననమరణాలకు తావులేని
మోక్షం లభిస్తుంది. ద్వంద్వాతీతుడైన భగవంతుడే ద్వంద్వాలలో కొట్టుకొని పోయే మనల్ని ఉద్ధరించగలడు. ద్వంద్వాలను అధిగమించడమే మనం చేయాల్సింది!
-ఆచార్య మసన చెన్నప్ప , 98856 54381