నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంది. కతు మహర్షి కోరిక మేరకు ఆయన ఇంట అమ్మ కాత్యాయనిగా జన్మించింది. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవ సాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి ఈమె. ‘పార్వతీదేవే కాత్యాయని’ అని అమరకోశం చెబుతున్నది. శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అవతారంగా పరిగణిస్తారు. మహిషాసుర సంహారంలో కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతున్నది. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనిని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మ. ఆ మూలపుటమ్మను ధ్యానిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. విద్యార్థులు ఆ తల్లిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. కన్యలు కాత్యాయనీ దేవిని కొలిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది.
నైవేద్యం: రవ్వకేసరి, పెసర పునుగులు