Mithun Chakraborty | ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం, కెరీర్లో ఏకంగా 180కి పైగా డిజాస్టర్లు, ముప్పై ఏళ్లుగా సరైన సోలో హిట్ లేదు. అయిన కూడా టాలీవుడ్(బెంగాలీ చిత్ర పరిశ్రమ), బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాశాడాయన. సాధారణంగా ఇండస్ట్రీలో వరుస పరాజయాలు ఎదురైతే హీరోల మార్కెట్ పడిపోతుంది. కానీ, ఆ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తూ ఏజ్ జస్ట్ నంబర్ నిరూపించాడు దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి.
1976లో మృణాల్ సేన్ తెరకెక్కించిన ‘మృగయూ’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేసిన మిథున్, తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అయితే ఆ తర్వాత ‘డిస్కో డాన్సర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రెండ్ సెట్ చేశారు. అయితే కాలం మారిన కొద్దీ నాణ్యత కంటే సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఆయన, ఏడాదికి పదికి పైగా సినిమాల్లో నటిస్తూ రికార్డు సృష్టించారు. ఇక 90వ దశకంలో చిన్న బడ్జెట్‌తో నెలల వ్యవధిలోనే తయారైన చిత్రాల్లో నటించడం వల్ల ఆయన ఖాతాలో భారీగా ఫ్లాప్స్ చేరాయి. దాదాపు 270 చిత్రాలకు పైగా నటించిన ఆయన కెరీర్లో 180కి పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి అంటే ఎంత కసిగా సినిమాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక 1995లో వచ్చిన ‘రావన్ రాజ్’ తర్వాత మిథున్‌కి సరైన సోలో హిట్ పడలేదు. అయినప్పటికీ తన స్ట్రాటజీ మార్చుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల వైపు అడుగులు వేశారు.

Mithun Chakraborthy
ఇక 72 ఏళ్ల వయసులో ఆయనకు సినిమా అవకాశలు ఎవరిస్తారులే అనుకుంటున్న సమయంలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 350 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అపజయాలను చూసిన మిథున్ చక్రవర్తి, కెరీర్ ముగింపు దశలో ఇచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ హిట్టే ఆయన అసలు సిసలైన స్టామినాని నిరూపించింది. ప్రస్తుతం మిథున్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నాడు. తెలుగులో కూడా మిథున్ గోపాల గోపాల చిత్రంలో నటించి మెప్పించారు.