కాకతీయుల సామంతులలో విరియాల వంశీయులు ముఖ్యమైనవారు. విరియాల కామసాని దంపతుల ప్రయత్నం వల్లనే కాకతి సామ్రాజ్యం చరిత్రలో నిలబడగలిగింది.అటువంటి విరియాల వంశానికి చెందిన ప్రోలిరెడ్డి వేయించిన ఒక శాసనం మొరిపిరాలలో ఉంది. ఈ మొరిపిరాల ప్రస్తుతం వరంగల్లు జిల్లాలోని రాయపర్తి మండలంలో ఉంది.శాసన కాలం శ.సం.1103= క్రీ.శ.1181. ప్లవ నామ సంవత్సరం మాఘ శుద్ధ ద్వాదశి.శాసనంలో మేష లగ్నం, పునర్వసు నక్షత్రం, నవ గ్రహాలు ఏకాదశస్తులై ఉండగా అని
తిథి వార నక్షత్రాలు పేర్కొనబడినాయి.
శ్రీ కొలిపాక సోమనాథ దేవుని ఇష్ట భృత్యుడైన కేతిరెడ్డి, వెలుసాని కొడుకు బాలిరెడ్డి, అతని ధర్మపత్ని బొల్లసానికి వంశాన్ని ఉద్ధరించే 4 కుమారులు జన్మించారు. వారు భీమిరెడ్డిబారి రెడ్డి, కేతిరెడ్డి, బాచిరెడ్డి, ప్రోలిరెడ్డి, ఇందులో ప్రోలిరెడ్డి అత్యంత ధర్మపరుడును, అధిక పుణ్యాధికుడుగా జన్మించి, పరమ పతివ్రత అయిన మాచమాంబను ధర్మపత్నిగా చేసుకున్నాడు. వంశ కర్తలైన సుపుత్రులను పొందినాడు.
ఇంకా ధర్మార్థ కామ మోక్షాలైన చతుర్విధ పురుషార్థాలందు చిత్తాన్ని నిలిపి కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల్లో స్థిరమైన దైవమైన ఈశ్వరుడు తనకు పరమ స్వామిగా తలంచినాడు. ఇక్కడ శివుడి గూర్చి విశేషంగా వర్ణించబడింది.
ఆ స్వామి చతుర్దశ భువనాలకు ఈశ్వరుడు, నంది వాహనుడు, పార్వతి మనో వల్లభుడు, శ్రీరామ రావణ ధనంజయ వరప్రసాదుడు, నారాయణ ప్రియుడు, ముప్పై మూడు కోట్ల దేవతారాధ్యుడు, గౌరీదేవి పూసుకున్న కుంకుమ చందనాలను అంకితం తీసుకున్న వక్ష స్థలం కల శరీరం కలవాడు (భార్యాభర్తల అనురాగానికి ప్రతీకగా చెప్పవచ్చు), త్రినేత్రుడు, శ్రీకైలాస నివాసుడు అని చెప్పబడినాడు. అలాంటి శివుడికి తన పేరు మీదుగా ఆలయాన్ని నిర్మించి ఆ ప్రోలేశ్వర దేవుని ప్రతిష్ఠించినాడు. భాగీరథీ సమానమైనట్టి బావిని నిర్మించినాడు. అందులో స్నానం చేస్తే పాప విముక్తులవుతారని, బ్రహ్మ హత్యా, గురు తల్పక దోషం, భ్రూణ హత్య మహా పాతక దోషాలన్నీ చెరిగిపోతాయని, దోష రహితులవుతారని చెప్పబడింది.
అట్టి ప్రోలేశ్వర దేవుని నైవేద్యానికి చింతచెర్వు వెనక మర్తులు 1, ఊరి దక్షిణాన పాటిమీది వెలి పొలము 5 మర్తులు, దేవునికి 1 కుంట, సంక దేవకు చింతల చెర్వు 1, వెలిపొలము మర్తురు 10 సమర్పించినాడు. ఈ దానానికి ఎవరైతే హాని కలిగిస్తారో వారు బ్రహ్మ హత్యాది దోషాలు చేసినవారవుతారు. శైవ ద్రోహులు, స్వామి ద్రోహులు అవుతారు. కాబట్టి దాని వైపు చూడరాదు. ఇంకా మామిడి తోట ఒకటి సమర్పించి ఆ మామిడి తోటలోని పండ్లన్ని దేవునికే చెందాలని, ఒకవేళ అందులోని ఫలాలను ఎవరైనా తింటే గోమాంసం తిన్నవారవుతారని చెప్పబడింది. ఈ విషయాలన్నీ ప్రోలిరెడ్డి చేత శాసనబద్ధం చేయబడింది.
శాసనం చివర విరియాల ప్రోలిరెడ్డి చేత కరణంగా నియమించబడిన మాలపరాజు వ్రాలు అని ఉంది. ఇందులో ప్రోలిరెడ్డి ప్రశంసతో పాటు అతడు ఎంతో భక్తితో ధ్యానించే శివుడి వర్ణన కూడా చాలా విశేషంగా ఉంది. దాన ఫలాలు చాలా కఠినంగా చెప్పబడినాయి.
-భిన్నూరి మనోహరి