యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ॥
ఇది.. శ్రీమత్ భగవద్గీతలోని చిట్టచివరి శ్లోకం. భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవా దం. సకల ఉపనిషత్తుల సారం. ఈ శ్లోకం భగవద్గీత విశిష్టతను తెలియజేస్తుంది. ఈ సార సంగ్రహం కృష్ణార్జున సంవాదంలో భాగం కాదు. వేదవ్యాస మహర్షి ముక్తాయింపు కాదు. సంజయుని అభిప్రాయం. కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే కాదు, ధృతరాష్ర్టునికి ఒక హెచ్చరిక. సమస్త మానవాళికి ఒక సందేశం.
యుద్ధభూమిని దర్శించడానికి వెళ్లిన సంజయుడు పదో రోజున భీష్ముడు అంపశయ్యాగతుడయ్యాక ధృతరాష్ర్టుని దగ్గరికి వస్తాడు. భీష్ముడు పడిపోయినందుకు దుఃఖించిన ధృతరాష్ర్టుడు పదిరోజుల యుద్ధాన్ని వివరంగా చెప్పమని సంజయుడిని అడిగాడు. అప్పుడు సంజయుడు పదిరోజులు యుద్ధం జరిగిన తీరును వివరిస్తూ, ‘యుద్ధం ఆరంభంలో అర్జునుడు మానసిక క్లేశాన్ని పొందాడు. ఆ క్లేశాన్ని పోగొట్టి, అతణ్ని యుద్ధ సంసిద్ధుడిని చేశాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు కర్తవ్యోన్ముఖుడు అయ్యేందుకు శ్రీకృష్ణుడు చేసిన బోధ పేరు భగవద్గీత’ అని చెబుతూ కృష్ణార్జున సంవాద సారాంశాన్ని పైన చెప్పిన శ్లోకంలో వివరించాడు సంజయుడు.
శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. అంటే యోగులలో ఈశ్వరుడు, శ్రేష్ఠుడు అని అర్థం కాదు. యోగానికి ఈశ్వరుడు. పరమాత్మ జీవాత్మల కలయిక పేరు యోగం. దానిని ప్రసాదించేవాడు ఈశ్వరుడు. కాబట్టి శ్రీకృష్ణుడు కేవలం పార్థసారథి కాదు, సాక్షాత్తూ పరమాత్మ. పార్థుడు కేవలం శ్రీకృష్ణుడి ఉపదేశాలను విని ఊరుకునేవాడు కాదు. అతను ధనుర్ధరుడు. విల్లంబులు ధరించి అధర్మపరులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నవాడు. శ్రీకృష్ణుడు జ్ఞాన, మోక్ష, సన్యాసాలకు నెలవు కాగా, అర్జునుడు గుణత్రయ విభాగాన్ని, విభూతి యోగాన్ని ఆకళింపు చేసుకొని విశ్వరూప సందర్శనాన్ని పొందిన కర్మయోగి. కృష్ణార్జునులు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుందని సంజయుని అభిప్రాయం. జ్ఞానేంద్రియాలను మనసు అధీనంలో ఉంచుకొని, కర్మేంద్రియా లను ధర్మబద్ధమైన పనులను చేయడానికి వినియోగించగలిగిన వ్యక్తులకు విజయం లభిస్తుంది. భౌతిక దేహాన్ని అర్జునుడి గానూ, అంతరాత్మను శ్రీకృష్ణ పరమాత్మగానూ భావించి జీవించగలిగితే మనం ఆచరించే పనులన్నిటా విజయంతోపాటు చంచలత్వం లేని జీవన విధానం, అష్టలక్ష్ముల అనుగ్రహమూ సిద్ధిస్తాయి.
‘ఇది నా అభిప్రాయం’ అని చెబుతున్నాడు సంజయుడు.
శ్రీకృష్ణుడి పట్ల భక్తిప్రపత్తుల కారణంగా సంజయుడికి ఏర్పడిన అభిప్రాయం కాదిది. అనుభవపూర్వకంగా చెప్తున్న మాట.
పదిరోజుల యుద్ధాన్ని, కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన బీభత్సాన్ని, భీష్ముడు పడిపోవడాన్ని చూసి తనకు తాను ఏర్పర్చుకున్న అభిప్రాయం. ‘కృష్ణార్జునులు పాండవుల పక్షాన ఉన్నారు. వాళ్లు కచ్చితంగా యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు. కౌరవులు అందరూ నశిస్తారు. ఇది తథ్యం’ అని ధృతరాష్ర్టుడిని హెచ్చరించాడు
సంజయుడు.
సంజయుడి హెచ్చరికను ధృతరాష్ర్టుడు లక్ష్యపెట్టి ఉంటే.. పదకొండో రోజు యుద్ధం జరిగి ఉండేది కాదు. దుర్యోధనాదులు అందరూ జీవించి ఉండేవారు. జన్మతః అంధుడైన ధృతరాష్ర్టుడు, స్వార్థభరితమైన పుత్రప్రేమ కారణంగా.. స్వచ్ఛమైన దృష్టికలిగి ఉన్న మనో నేత్రానికి కూడా అంధత్వాన్ని సాధించుకున్నాడు. సత్యాన్ని చూడలేకపోయాడు. ధర్మాన్ని విస్మరించాడు. మనోనేత్రానికి అంధత్వం కలగకుండా చూసుకోవడాన్ని మన కర్తవ్యంగా భావించాలి. అలా భావిస్తే చాలు సంజయుడి ఆప్తవాక్యం మన విషయంలో నిత్యసత్యం అవుతుంది.