మంగళవారంతో కూడిన శ్రావణ బహుళ చతుర్థి ఉంటేనే, సంకష్టహర గణపతి వ్రతాన్ని ప్రారంభించాలని చెబుతున్నారు! నిజమేనా? – శ్యామ్‌ప్రసాద్, హైదరాబాద్
‘సంకష్టహరణం నామ సంపత్తి సుఖదాయకం- అన్ని వ్రతాలలో అత్యంత శ్రేష్ఠమైనది, సమస్త సుఖసంపదలను ప్రసాదించే వ్రతం సంకష్టహర గణపతి వ్రతం’ అని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని సాక్షాత్తు గణపతి పార్వతీదేవికి ఉపదేశించాడు. అందుకే, ఈ వ్రతానికి అంతటి ప్రాశస్త్యం ఏర్పడింది. ఈ వ్రతం ఎప్పుడు ఆరంభించాలనే విషయంలో పెద్దలు మార్గనిర్దేశం చేశారు. ఏ మాసంలో అయినా బహుళ చతుర్థి నాడు వ్రతం ప్రారంభించవచ్చు. విశేషించి శ్రావణ కృష్ణ చతుర్థి రోజు ఆరంభించి 21 నెలలు గానీ, 21 సంవత్సరాలు గానీ చేయవచ్చని శాస్త్రం చెబుతున్నది.
శ్రావణే బహుళే పక్షే చతుర్థ్యాంతు విధూదయే
గణేశం పూజయిత్వాతు చంద్రాయార్ఘ్యం ప్రదాపయేత్
(స్కాంద పురాణం)
పై శ్లోకాన్ని అనుసరించి శ్రావణ మాసం బహుళ చతుర్థి రోజు వారంతో పనిలేకుండా వ్రతాన్ని ఆరంభించవచ్చు. ఆరోజు స్నానాదులు ముగించుకొని గణపతి వ్రతాన్ని ఆరంభిస్తానని సంకల్పించి, సాయంకాలం వరకు వినాయకుడిని స్మరిస్తూ, చంద్రోదయం తర్వాత గణపతిని సవిధిగా పంచామృత అభిషేకాలతో, ఎరుపు రంగు పుష్పాలు, గరికతో పూజించి, చంద్రుడికి అర్ఘ్యాదులు సమర్పించాలి. పొద్దంతా ఉపవాసం ఉండి, చంద్రుడి దర్శనం తర్వాత భోజనం చేయాలి. కాబట్టి, సంకష్టహర గణపతి వ్రతాన్ని మంగళవారంతో కూడిన చతుర్థి రోజునే ఆరంభించాలనే నియమం ఏదీలేదు.
-శాస్ర్తుల , వేంకటేశ్వరశర్మ , 98499 09165