‘సూర్యుడే బాహ్యప్రాణం, భూమి అపానాన్ని నియంత్రిస్తుంది, ఆకాశమే సమానం, వాయువు వ్యానం, అగ్ని ఉదానం’ అని అశ్వలుని కుమారుడైన కౌసల్యుడికి పిప్పలాద మహర్షి ప్రాణం, దాని భాగాల గురించి చెప్తూపోతున్నాడు.
కౌసల్యుడు, ‘ఓ దైవసమానుడా! ప్రాణం ఎక్కడి నుంచి జన్మించింది? ఎలా శరీరంలోకి వస్తుంది? తనను విభజించుకొని శరీరంలో ఎలా ఉంటుంది?’ ఇలా అనేక ప్రశ్నలు వేస్తాడు.
అప్పుడు పిప్పలాద మహర్షి ప్రతి ప్రశ్నకూ ఎంతో ఓపికతో, వివరణాత్మకంగా జవాబులిస్తూ, ఆత్మ నుంచే ప్రాణం ఉద్భవిస్తుందని, నీడలా ఆత్మలో ప్రాణం విస్తరించి ఉందని, మనసు చేష్టల వల్ల శరీరంలోకి వస్తుందంటాడు. ఆయన వివరించిన అద్భుత విషయాల సమాహారమే ప్రశ్నోపనిషత్తు.
ఆత్మ నుంచే ప్రాణం ఉద్భవించిందనడం ఎంతటి నిజం! ఈ సూర్యుడు, భూమి, చంద్రుడు మొదలైనవి ఒకనాడు లేవు. అప్పుడంతా ఆత్మ అని పిలిచే శక్తి మాత్రమే ఉండేది. ఆ శక్తి నుంచి మొదట సూక్ష్మాతి సూక్ష్మకణాలు, పరమాణువులు, వాటినుంచి హైడ్రోజన్ అణువులు, వాటి సమాకలనం నుంచి సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర ఖగోళ పదార్థాలు కాలక్రమేణా ఉనికిలోకి వచ్చాయి. ఇవన్నీ కాలగమనంలో పడి పరిణామం చెందుతూ పోతున్నాయి. ఆ పరిణామ క్రమంలోనే పంచభూతాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిణామక్రమం పూర్తికాగానే ఈ ఖగోళమంతా ఆత్మగా మారిపోతుంది.
భూమ్మీద మాత్రమే పంచభూతాలు మనగలుగుతున్నాయి. వాటి మేలి కలయికే జీవి, జీవిలోని ప్రాణమని మనకు అర్థమవుతుంది. పంచభూతాల సంలీనంలో చంద్రుడిది కీలకపాత్ర. తన గురుత్వాకర్షణ ద్వారా భూమ్మీద పంచభూతాల కలయికను ప్రేరేపిస్తూ ఉంటాడు చంద్రుడు. మిగతా గ్రహాలపైన జలం లేకపోవడం వల్ల వాటి మీద ‘జీవి’ పుట్టడం లేదు.
పంచభూతాలు నిరంతర చలనశీలతను కలిగి ఉంటాయి. గాలి నిరంతరం చలిస్తూ ఉంటుంది. నీరు నిలువ ఉన్నా తనలో తాను చలిస్తూనే ఉంటుంది. అగ్ని అంటే ఉష్ణశక్తి నిలువ ఉండకపోగా, ఒకచోట స్థిరంగా ఉండలేదు. ఇక ఆకాశమంటారా! అనంతశక్తితో నిండి ఉన్న ఆకాశానికి నిశ్చలమెక్కడ? అది నిరంతర చలనశీలి. అంటే ఒకచోటి నుంచి మరొకచోటికి ప్రయాణించదు కానీ, తనలోతాను మనం గుర్తించలేనంత సూక్ష్మాతిసూక్ష్మ దశలో చలిస్తూ ఉంటుంది. మనం సాధారణంగా భూమి కంపనాలను ఏ విధంగా గుర్తించలేమో అలాగే ఆకాశ చలనశీలతనూ గమనించలేం.
పంచభూతాల ఐదు స్పందనలు తగురీతిలో కలవడం వల్ల ఉత్పన్నమయ్యే ఉత్కృష్ట స్పందనే ‘జీవం’. దాన్నే మనం ప్రాణం అంటాం. తల్లిదండ్రుల నుంచి సంలీన ప్రక్రియ ద్వారా వచ్చిన ప్రాణానికి, తల్లి తీసుకునే ఆహారం ఒక ఆకృతినిస్తూ, ప్రాణ ప్రసరణను పెంచుతూ పోతుంది. అదే ఆకృతి గర్భావధి దాటగానే ప్రత్యేక జీవిగా భూమ్మీద పడుతుంది. మనం తీసుకునే ఆహారం జీవాన్ని నిలుపుతూ, అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. ఆ జీవం మనం పీల్చే గాలి, తాగే నీటి ద్వారా శరీరమంతటా రవాణా చెందుతుంది. సర్వకాల సర్వావస్థలలో పంచభూతాల చైతన్యశీలత ఏకమై ప్రాణంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే పంచభూతాలలో ఏ ఒక్కటైనా సంలీనదశ నుంచి తప్పుకొంటుందో అప్పుడు ప్రాణమనే చైతన్యశక్తి నిలిచిపోతుంది. ఆహారం జీర్ణం చేసుకోలేకపోవడం, గాలిని శ్వాసించలేకపోవడం, నీటిని స్వీకరించలేకపోవడం ఇలా మనలో ఈ పంచభూతాల విస్తృతి సాధ్యం కాని దశ ఏర్పడినప్పుడు శరీరంలో ప్రాణోత్పత్తి, ప్రాణ ప్రసరణలు నిలచిపోతాయి.
‘స యథా సోమ్య వయాంసి వాసోవృక్షం సంప్రతిష్ఠన్తే ఏవం హ వై తత్ సర్వం పర ఆత్మని సంప్రతిష్ఠతే’
‘అందగాడా! పక్షులు తాము నివాసం ఏర్పరచుకున్న వృక్షాన్ని చేరుకున్నట్లే అవి అన్నీ శ్రేష్ఠమైన ఆత్మలో లయమవుతాయి. ఈ భూమీ, భూమి తన్మాత్ర, నీరూ, నీటి తన్మాత్ర, కాంతి, కాంతి తన్మాత్ర, ఆకాశం, ఆకాశ తన్మాత్ర, పంచేంద్రియాలు, బుద్ధి, ప్రాణం, దానితో ముడివడి ఉన్నవన్నీ ఆత్మలోనే లయం అవుతున్నాయి’ అంటాడు పిప్పలాద మహర్షి ప్రశ్నోపనిషత్తులో. ఆలోచనలతో ఈ విశ్వాన్ని ఆక్రమిస్తే అర్థమయ్యేది అదే కదా!
-రావుల నిరంజనాచారి