తిరుపతి : తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో మొదటిసారిగా ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలకు ఒక రోజు ముందు సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించనున్నామని టీటీడీ వేద పండితులు తెలిపారు.
మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, చివరి రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిస్తాయని వివరించారు. ఆగస్టు 23న ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని వెల్లడించారు.