పేతురు ప్రభువుకు మొదటి శిష్యుడు. అందరిలో పెద్దవాడు కూడా. జాలరిగా సముద్ర తీరంలో, తెగిపోయిన వలలు గట్టిగా ముడి వేసుకొంటూ ప్రభువుకు కనిపిస్తే, ‘మీరు చేపల్ని కాదు పట్టేది, మనుషుల్ని పట్టేట్టు చేస్తా రండి’ అంటూ ప్రభువు వారిని ప్రేమగా పిలిచాడు. ఎప్పుడూ ప్రభువు చుట్టూ ఉండేది ప్రజలే ! ఆయన్ను గురించి ప్రజలు రకరకాలుగా భావించేవారు. వారిలో కొందరు ఆయన్ను బాప్తిజం ఇచ్చే యోహాను అనీ, మరికొందరు ఏలీయా అనీ, ఇంకొందరు యిర్మీయా అనీ, వేరేవారు ప్రవక్తల్లో ఎవరో ఒకరనీ చెప్పుకొంటూ ఉండేవారు. అది విని ప్రభువు, శిష్యుల వంక చూసి ‘అయితే నేను ఎవరినని అనుకుంటున్నారు’ అని అడిగాడు. అందుకు సీమోను పేతురు ‘నీవు సజీవుడగు దేవుడి కుమారుడవైన క్రీస్తువ’ని గట్టిగా నిస్సందేహంగా చెప్పేశాడు. అందుకు ప్రభువు.. ‘వాస్తవం గ్రహించిన నీవు ధన్యుడవు, నీ పేరు చూస్తే పేతురు (పేతురు అంటే పెనుబండ అని అర్థం) ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళలోక ద్వారాలేవీ దాని యెదుట నిలువ నేరవు’ అని పేతురుకు అధికారం దయచేశాడు ప్రభువు (మత్తయి – 16 : 12-20). ఆ సంఘం యావత్ క్రైస్తవ సంఘం. ఆ సంఘానికి అప్పుడు నియమితుడైన వాడే పేతురు. ఆయన పరంపరే కతోలిక క్రైస్తవ పీఠానికి నియమితులయ్యే పోప్ పీఠం. కనుక ఈ పోప్ పీఠానికి ఆద్యుడు పేతురే.