రావే ఈశ్వర కావవే వరద!..
గజేంద్ర ఉవాచ- మేటి నటుని వలె మాయా వటువు (వామనుని) వంటి పలు విధాలైన వేషాలతో (అవతారాలతో) పటుతరమైన ప్రతిభను ప్రదర్శిస్తూ లీలానాటకమాడే నటన సూత్రధారిని, మునులు దేవతలు కూడా పరిపూర్ణంగా ప్రస్తుతింపజాలని పరమ పురుషుని,
గజేంద్ర ఉవాచ- మేటి నటుని వలె మాయా వటువు (వామనుని) వంటి పలు విధాలైన వేషాలతో (అవతారాలతో) పటుతరమైన ప్రతిభను ప్రదర్శిస్తూ లీలానాటకమాడే నటన సూత్రధారిని, మునులు దేవతలు కూడా పరిపూర్ణంగా ప్రస్తుతింపజాలని పరమ పురుషుని, విరక్తులైన భక్తులు తప్ప విషయాసక్తులైన ఇతరులెవరూ అశక్తులై తెలియనేరని విశేష చరిత్ర కల పరమాత్ముని వేరుగతి లేని నేను నతి- నమస్కార పూర్వకంగా నుతి (స్తుతి)స్తున్నా. జ్ఞానాగ్నిలో కర్మబంధాలను కాల్చివేసుకొన్న మహాయోగులు యోగాభ్యాస బలంతో ఏ పరమాత్ముని బాగా దర్శింపగలరో, ఎవడు నిగమ ఆగమ (వేదశాస్ర్తా)లకు సాగరం వంటివాడో, దిశ-దిక్కు లేని నా వంటి పశువుల పాపాలను కూడా పోగొట్టే దీనబంధువు దయాసింధువునకు, మనసుకు మాటలకు అందని, అందరి అంతరంగాలలో ఆత్మగా వెలిగే ఆ ఆనందమూర్తికి అనేక వందనాలు! మత్తేభమే (ఏనుగే) కాదు, మృత్యుపాశం మెడకు చుట్టుకొని ఉన్న, వాసనా జ్ఞానం తప్ప వివేకజ్ఞానం లేని మానవులు కూడా పశువులే. పాశబద్ధుడు జీవుడు, పాపముక్తుడు శివుడు!
గజేంద్రుడు ఇంకా ఇలా భావించాడు… ఆ పరమపురుషుడు స్త్రీ, పురుష, షండ( నపుంసక) రూపుడు కాదు. నర, సుర (దేవ), జంతు రూపుడూ కాదు. తాను ఏదీ కాకనే, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, గుణభేదాలు- అనాదిగా ఇలా అన్నీ తానే అయి ఉండే అఖండ ప్రజ్ఞాన స్వరూపుడైన ప్రభువును స్మరిస్తా.
ఇంతగా ప్రార్థించినా పంతం పూనినట్లు పరమాత్మ తన చెంతకు చేరనందుకు చింతిల్లిన గజేంద్రుని అంతరంగంలో రవ్వంత సందేహం కల్గింది- ఆ దొరకు నా మొర వినిపించలేదా? ఆలకిస్తే త్వరపడి నా దరికి ఏల రాలేదు. ఆ దేవుడు దీనుల యెడల ఎంతో దయతో ఉంటాడని అంటారే! ఆ పరాత్పరుడు పరమయోగి బృందాల పాలిట కూడా ప్రేమతో మెలుగుతాడని పలుకుతారే! ఆ అనంతుడు అన్ని దిక్కులలో అంతటా ఉంటాడని చెప్తారే! మరి ‘ఉన్నాడు ఉన్నాడు’ అని పేరెన్నిక గన్నవాడు నిజంగా ఉన్నవాడా, లేనివాడా?
కం॥ ‘కలడందురు దీనుల యెడఁ
గలఁడందురు పరమయోగి గణములపాలం
గలఁడందురన్ని దిశలను
గలఁడు కలండనెడు వాడు గలఁడో లేడో!’
భక్తుడైన గజేంద్రునికి గరుడధ్వజుని (విష్ణువు) ఉనికి యందు కరుడుగట్టిన నమ్మకమున్నా ప్రాణభయంతో ఆర్తుడు కాగా ఆత్మైస్థెర్యం సడలి అంతఃకరణంలో సందేహం కమ్ముకొంది. కమలనాథుడు ‘కలడో లేడో’ అంటూ కరిణీనాథుడు సంశయాత్ముడై కలవరపడుతూ ఉంటే, నిశ్చయాత్ముడైన ప్రహ్లాదుడు మాత్రం- ‘సందేహము వలదు’, ఇందీవర శ్యాముడు గోవిందుడు ‘ఎందెందు వెదకి చూచిన అందందే గలడు’ అని నిర్దంద్వంగా ప్రకటించాడు. ‘కలడో లేడో’ అన్న పై కందపద్యం పోతన్న సొంతం. గజేంద్రుని వలె ప్రాణసంకటంలో పడి వెంకటరమణుని శరణు వేడినా దయరాక, దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరవుతూ, నీరజాక్షుని (విష్ణుని) ఉనికిని నివారించలేక నిశ్చయించనూ లేక గిజగిజలాడే పలువురు తెలుగువారి నోట ‘కలడు కలండనెడు వాడు కలడో లేడో’ అన్న ఈ నిట్టూర్పు నేటికీ తెనుగునాట వినపడటం కద్దు!
గజేంద్ర ఉవాచ- అయ్యో! నా విషయంలో భగవంతుని అస్తిత్వాన్ని- ఉనికిని, అనుమానించడమేల? ఆయన కలిమి లేములు అనేవి చూడక అందరికీ అండగా ఉండువాడు కదా! నాకు కూడా అందుబాటులో ఉంటాడు. దుర్జనుల బారినపడ్డ సజ్జనులకు సాయపడువాడు నా విషయంలో ఎందుకు తర్జనభర్జన పడతాడు?’ ‘చూడడే నా పాటుఁ జూపుల జూడక చూచువారలఁ గృపఁ జూచువాడు’- బయటి చూపులు వదలి అంతర్ముఖులై తననే చూచువారిని తప్పక దయ చూస్తాడు. నా కష్టాన్ని కూడా కంటాడు. దీనుల మొరలు ఆలకించి, మైమరచి కరగిపోయే దేవర నా మొర కూడా వింటాడు- ‘భక్త జనముల దీనుల పాలివాడు, వినఁడె చూడఁడె తలఁపడె వేగరాఁడె!’
కం॥ ‘విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్’
‘విశ్వానికి నిర్మాత- కర్త అయి కూడా దానిచే అంటబడక నిర్మమగా ఒంటరిగా ఉండువాడు, విశ్వానికి అంతరాత్మయై ఉన్నవాడు, కనుకనే విశ్వంచే విశేషంగా వేద్యుడై- ఎంతగానో తెలుసుకోదగిన వాడై విరాజిల్లువాడు, విశ్వంగా ప్రతీతమవుతున్నా- కనిపిస్తున్నా, అవిశ్వుడై- అనగా విశ్వానికి అతీతంగా ఒంటివాడై అలరారువాడు, పుట్టుక లేకుండా శాశ్వతుడై- తరగని, పెరగని, చెరగని వాడై, ముక్తికి నిధానమై తన అధీనంలోని లోకాన్ని తిరుగులేని తనదైన విధానంలో వ్యవధానం (విరామం) లేకుండా నడిపిస్తున్న ప్రధాన పురుషేశ్వరుని నేను ఆరాధిస్తా!’ ఈ కందం మూలంలోని అనుష్టుప్ శ్లోకానికి అమాత్యుని కూలంకష యథాక్షర అనువాదం.
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! ఈ విధిని (విధంగా) తన హృది-మనసులో పెన్నిధి అయిన పరమాత్ముని సన్నిధిని నెలకొల్పి సుధీమణి గజేంద్రుడు ఇలా ప్రార్థించాడు..
శా॥‘లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యెఁ, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరంబెరుగ, మన్నింపం దగున్ దీనునిన్,
రావే ఈశ్వర! కావవే వరద, సంరక్షింపు భద్రాత్మకా!
‘దీనశరణ్యా! అహీనమైన నా శక్తి క్షీణదశకు వచ్చింది. అన్నీ ఉన్నప్పటి మనోధైర్యం ఇప్పుడు సన్నగిల్లింది. ప్రాణాలు నిలకడ తప్పి మర్మస్థానాల- వాటి కుదుళ్ల నుంచి కదలి పైపైకి లేస్తున్నాయి. మూర్చ వస్తోంది. శరీరం శిథిలమై (చితికి)పోయింది. శ్రమ కలుగుతోంది. నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు. ఆర్తితో అలమటిస్తున్న ఈ దీనుని మదిలో పదిలంగా పాదుకొన్న అనాది అవిద్యను- అజ్ఞానాన్ని తొలగించి నన్ను ఆదుకోవడం నీకు న్యాయం. దేవాధిదేవా! వరాలిచ్చే దేవరా! వడివడిగా రావయ్యా! కరుణించి కాపాడవయ్యా! భద్రాత్మకా!- శుభంకరా! అశుభమైన నా సంసార భయాన్ని బాపవయ్యా!’
హృద్యమైన ఈ పద్యం అనన్య భక్తికి, ఆర్తికి, శరణాగతికి పతాక చిహ్నం! పరాకాష్ఠ! జీవుని ఒక నిస్సహాయ స్థితిని కళ్లకు కట్టినట్లు, కన్నుల పండుగగా, శ్రవణానందంగా వర్ణించిన ఈ పద్యం తెలుగువారందరికీ నోటికి వచ్చిన ఆత్మీయ పద్యమవడమే దీని అనవద్యమైన అందం!
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

