దైవాత్మకంగా మనిషి దేనినైనా విశ్వసించవచ్చు. విశ్వాస కేంద్రం ఏదైనా సంపూర్ణమైనదే అయితే అది ఆశించిన ఫలితాల వైపు మన బుద్ధిని, వైఖరిని నడుపుతుంది. ఒకవేళ భిన్నమైన ఫలితాలు వచ్చినా భక్తుడు వాటిని తన విశ్వాసం తనకు మరొక రూపంలో చేసిన మేలుగానే స్వీకరిస్తాడు. విశ్వాసం ప్రజ్ఞానానుభవంతో నడిచేది కాదు. అలాగే నాస్తికుడి అవిశ్వాసం కూడా! ఆస్తికమైనా, నాస్తికమైనా ప్రత్యక్షానుభవంపై ఆధారపడకుండా ఒక ‘సంభావిత’ సత్యంగా సాగవలసిందే. అయితే, మనిషి తన జీవితాన్ని తరచి చూస్తే, తన ప్రత్యక్షానుభవాన్ని తెరిచిచూస్తే.. ప్రకృతి, సమాజం అందించే లెక్కకందని అనుకూలత రూపంలో ‘భగవద్విభూతి’ అనుభూతికి స్పష్టంగానే సాక్షాత్కరిస్తుంది.
విశ్వాసాల మాట ఎలా ఉన్నా మనిషి ఉనికి అనేకానేక భౌతిక, జీవశక్తుల గతిశీలనాత్మక అల్లిక. దీనంతటికీ ఆధారం నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశమనే పంచభూతాలే. వీటిలో మిగతా నాలుగు భూతాలను తనలో కలుపుకొని, నిలుపుకొన్నది నేల. మనిషితోపాటు అన్ని వృక్ష, జంతుజాతులకు, సూక్ష్మజీవి ప్రపంచానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారం నేలే. మట్టిని నిర్జీవ పదార్థంగా భావించవద్దు. అది అసంఖ్యాకమైన జీవరాశిని, ఖనిజ లవణాలను, తేమను కలిగిన ఒక మహా జీవావరణ వ్యవస్థ. ఒక పిడికెడు మట్టిలో కొన్ని కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులే మరణించిన దేహాలను విచ్ఛేదనం చేసి వృక్షజాతికి, పంటలకు పోషణను అందిస్తాయి.
భూగోళంపై ఉన్న మట్టి లాంటి జీవావరణ వ్యవస్థ మనకు తెలిసినంతవరకు విశ్వంలో మరెక్కడా లేదు. అంతటి విశిష్టమైంది మట్టి. అది విత్తనంలోని ‘జీవిని’ ఆవిష్కరించే చైతన్యశక్తి. ఎండిపోయిన గింజను కూడా మహావృక్షంగా మార్చేస్తుంది. అనంత ఖనిజాలతో పాటు అఖండ జలభాండాన్ని నేలతల్లి తన గర్భంలో నిక్షిప్తం చేసుకుంది. భూమిపై పారుతున్న నదుల నీటి కన్నా 800 రెట్ల నీరు భూమి పొరల్లో ప్రవహిస్తున్నదంటే ఆశ్చర్యం కలగకమానదు. భూ ఉపరితలంపై 70 శాతం సముద్రమే ఆక్రమించి ఉన్నా.. భూతలజీవులకు కావలసిన మంచినీరు ప్రసాదించేది నేల తల్లే. భూదేవిని కాపాడుకోకపోతే నేల బీడుగా, ఎడారిగా మారిపోతుంది. అభివృద్ధి పేరిట మనం ఆచరిస్తున్న విధానాలు నేల సారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే నేలపై జీవవైవిధ్యం నశించి, వ్యవసాయం వీలుపడక, ఆహార కొరత ఏర్పడి క్షామానికి, అశాంతికి దారితీస్తుంది. మన అత్యాశే మానవ వినాశనానికి కారణం అవుతుంది.
మట్టి నుంచే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల వికాసం జరుగుతుంది. మట్టి ప్రాశస్త్యాన్ని ఇంతగా గ్రహించింది కాబట్టే, భారతీయ ఆర్ష సంప్రదాయం నేలను భూ మాతగా, భూ దేవిగా, పృథ్వీలింగంగా సంభావించి ఆరాధిస్తున్నది. మహాకాలపురుషుడితో కలిసి ప్రకృతిమాత ఏ తారతమ్యమూ లేక ఆహార ఔషధాలను అందరికీ సమానంగా కరుణిస్తున్నది. అయినా మానవజాతి మందబుద్ధితో, మలినబుద్ధితో, అహంకారంతో నేల ఔన్నత్యాన్ని విస్మరించి జీవితాలను నిరర్థకం చేసుకుంటున్నది. అయితే ప్రజ్ఞాన ప్రకాశంతో మనిషి ఒక్కసారి మట్టితో మమేకమైతే సకల జీవరాశిలో తనను తానే దర్శించుకోగలుగుతాడు. ఆ విశాలమైన అవగాహన, అనుభూతి మానవజాతిలో భేదాలను తుంచి, ప్రాణికోటితో ప్రేమను పెంచి, సంక్షేమంతో, సంతోషంతో ఆత్మోన్నతిని పోషిస్తుంది. మోక్షశివ కవాటాలను తెరుస్తుంది. అందుకే మన ఉనికి అయిన మట్టిని ప్రేమిద్దాం. నేలసారాన్ని పెంచుతూ కృతజ్ఞతతో ఆరాధిద్దాం. మన పూర్వికులు మనకు ప్రసాదించిన బంగారు భూమిని భావితరాలకు అంతే భద్రంగా అప్పగిద్దాం.