Chintana | వృద్ధుడైన ఓ వస్త్ర వ్యాపారి తన వ్యాపార బాధ్యతలను కొడుక్కు అప్పగించాలనుకున్నాడు. వ్యాపారంలో కొన్ని మెలకువలు చెప్పాడు. తనను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కొడుకు. ‘వ్యాపారంలోనే కాదు, ఏ విషయంలోనూ అత్యాశకు పోవద్దు’ అని దీవించాడు తండ్రి. ‘ఆశ లేకపోతే ఎలా సంపాదించగలం?’ అన్నాడు కొడుకు. దానికి వ్యాపారి నవ్వుతూ ‘సముద్రానికైనా హద్దులుంటాయేమో కానీ, ఆశకు ఉండవు. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను..’ అంటూ ఇలా చెప్పాడు. ‘ఒక చక్రవర్తికి కడుపులో కణితి వచ్చింది. పక్క రాజ్యంలో చక్కటి శస్త్రచికిత్స నిపుణుడు ఉన్నాడని తెలిసింది. అయితే ఆ వైద్యుడు ఆశబోతు అని చెవిన పడింది. అతణ్ని పిలిపించే ఆలోచన విరమించుకున్నాడు చక్రవర్తి. అయితే రోజులు గడిచేకొద్దీ కణితి నొప్పి తీవ్రమైంది.
ఇక లాభం లేదని ఆ వైద్యుడిని పిలిపించాడు. ‘నేను మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుణ్ని చేస్తాను. అయితే, నేను అడిగింది ఇవ్వాలి’ అని కోరాడు. ‘నాకు నయం చేస్తే.. ఈ రాజ్యమంతా నీకు రాసిస్తాను’ అన్నాడు చక్రవర్తి. చెప్పినట్లే కణితి తొలగించి, చక్రవర్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని చేశాడు వైద్యుడు. ఇచ్చిన మాట ప్రకారం రాజ్యమంతా వైద్యుడికి కట్టబెట్టబోయాడు చక్రవర్తి. అయినా తృప్తి చెందని వైద్యుడు ‘మరి దాని మాటేమిటి?’ అంటూ ఆకాశం వంక చూశాడు. ఆకాశాన్ని కూడా తనకే ధారాదత్తం చేయమంటున్న వైద్యుడి అత్యాశకు చక్రవర్తితోపాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. అత్యాశపరుడికి ఎంత సంపాదించినా సంతోషం ఉండదు. అలాంటివాళ్లు సుఖపడిన దాఖలాలు లేవు’ అని కథ ముగించాడు. మితిమీరిన ఆశాపాశంలో చిక్కుకోకుండా ధర్మంగా వ్యాపారం చేసుకో అని కొడుకును దీవించాడు. ఆశలేని వాడే అందరికన్నా అదృష్టవంతుడని తెలుసుకున్నాడు కొడుకు. ధర్మబద్ధంగా వ్యాపారం కొనసాగించాడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821