తిరుపతి : తిరుచానూరు పద్మావతి (Padmavati ) అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చనను నిర్వహించారు. నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనాన్ని నిర్వహించారు.
అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో జె. శ్యామల రావు (TTD EO) దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి, కంకణ భట్టార్ శ్రీనివాసాచార్యులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఈవో
ఈవో జె. శ్యామల రావు మాట్లాడుతూ మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామని, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.