ఎముకలు కొరికేంత చలి. ఇద్దరు సన్యాసులు హిమాలయంలో చిన్నగా నడుస్తూ ఉన్నారు. వారిలో ఒకరు వృద్ధుడు కాగా, మరొకరు నడివయస్కుడు. వారిలో చిన్న సన్యాసి, వృద్ధుడైన సన్యాసిని ‘అందరూ ఎందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించరు? కొందరే ఆ మార్గాన్ని ఎందుకు అనుసరిస్తారు?’ అని ప్రశ్నించాడు. వృద్ధుడైన సన్యాసి చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ‘చీకటి దారిలో పోతున్న వారి కాళ్ల ముందర ఒక వస్తువు పడి ఉంటుంది. కొందరు దాన్ని పట్టించుకోకుండా దాటుకుని వెళ్తారు. మరి కొందరు చేతిలోకి తీసుకుని అది తమకు ఉపయోగపడదని భావిస్తారు.
పక్కన పడేసి వారి దారిన వారు వెళ్లిపోతారు. ఇంకొందరు దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని కొంత దూరం ప్రయాణిస్తారు. కొద్ది దూరం వెళ్లాక అవసరంలేని దాన్ని మోయడం ఎందుకని దూరంగా పడేస్తారు. మిగిలిన వారిలో కొందరు దాన్ని ఇంటివరకు తీసుకువెళ్తారు. కానీ, అది ఏమిటని పరిశీలించి చూడరు. ఎక్కడో ఒకచోట పెట్టేస్తారు. దాని విషయమే మరిచిపోతారు. చాలా తక్కువమంది మాత్రమే ఆ వస్తువును పరిశీలిస్తారు. అది వజ్రమని తెలుసుకుంటారు. దాని గొప్పతనం తెలుసుకుని ఆనందిస్తారు.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే వస్తువు ఒక్కటే. గ్రహీతల్లోనే తేడా. ఆధ్యాత్మిక మార్గం కూడా అంతే. అందరికీ అందుబాటులో ఉన్నదే. అనుసరించడంలోనే తేడా’ అని వివరించాడు. నడివయసులో ఉన్న సన్యాసికి అసలు విషయం బోధపడింది. ‘వ్యాధికి ముందు ఆరోగ్యాన్ని, మరణానికి ముందు జీవిత కాలాన్నీ మహా భాగ్యాలుగా భావిస్తాం. గుర్తించాల్సిన సమయంలో వాటి విలువ గుర్తించం. అప్రధానమైనవి ప్రధానంగా భావించి వాటికోసం అమూల్యమైన జీవిత కాలాన్ని వృథా చేసుకుంటాం. సంపదల వైపు, సంపాదనల వైపు పరుగులు తీస్తాం. పట్టుకోవాల్సింది పట్టుకోక పనికిమాలినవన్నీ మోస్తాం. వాటిలోనే ఆనందం ఉందని మురిసిపోతాం. అసలు సంపద ఆధ్యాత్మిక సంపదేనని మరుస్తాం. అయినా తల పైకెత్తి చూస్తేనే కదా రంగురంగుల ఇంద్రధనస్సు కనబడేది. దాని అందచందాలు తెలిసేది’ అని అర్థం చేసుకుని ముందుకు కదిలాడు.
…?ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821