e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home చింతన సాయుజ్య సిద్ధి!

సాయుజ్య సిద్ధి!

  • భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
  • ఇతి స్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వమితియః
  • తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం
  • ముకుంద బ్రహ్మేంద్ర స్పుట మకుట నీరాజిత పదామ్‌!
  • ఆదిశంకరాచార్యులు (సౌందర్యలహరి: 22)

‘భవానీ అంటే సమస్త సంసారాన్ని జీవింపచేసే చిద్రూపిణి అయిన తల్లి. త్వం దాసే, నీ దాసుడను. నీ కృపా కటాక్షాలను నాపై ప్రసరింపజేయుమనే భావనతో నిన్ను స్తుతించేందుకు సన్నద్ధమైన ఏ భక్తుడైనా, అమ్మా! నీ దాసుడను అనే రెండు మాటలు పలికితే చాలు. అంతలోనే పుత్రవాత్సల్యంతో ఆ త్రిమూర్తులతో పాటు ఇంద్రునికీ అసాధ్యమైన సాయుజ్య పదవిని అతనికి అనుగ్రహిస్తున్నావు. నీ సాయుజ్యాన్ని పొందడానికి వారు తమ మణిస్థగిత కిరీటాలను హారతిగా పడుతున్నారు. అయినా, వారికన్నా ముందుగా భక్తులను అనుగ్రహిస్తున్నావు’ అంటారు ఆదిశంకరులు.

మనసులో అమ్మను తలచుకొని ‘భవాని త్వం’ అనగానే సాధకుని భావనకు అనుగుణమైన విధంగా తల్లి సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది. ‘సాయుజ్యమే’ ఎందుకు? అమ్మ కటాక్షం పొందడానికి నాలుగు స్థితులున్నాయి. మొదటిది: సాలోక్యం (అమ్మను చూడగలగడం). రెండవది: సామీప్యం (అమ్మకు చేరువైన భావనను పొందడం’. మూడవది: సారూప్యం (అమ్మ రూపమే తాను అనుకోవడం). నాలుగవది: సాయుజ్యం. (అమ్మలో లీనం కావడం). భక్తుడు కోరిన దానికన్నా ఎక్కువగా ఇచ్చే కరుణామూర్తి అమ్మ. ఆమె భావనా గమ్య (లలితా సహస్ర నామం). అంటే, సమస్త భావనలకు గమ్యమైన పరమభావన ఏదో దాని పరమార్థమే లలితాదేవి.

- Advertisement -

‘భవానీ త్వం’లోని ‘త్వం’ అనేది ‘మహావాక్యం’గా పెద్దలు చెప్తారు. పరబ్రహ్మ స్వభావాన్ని, స్వరూపాన్ని ప్రతిపాదించే మహావాక్యాలు నాలుగున్నాయి. అవి ఉపనిషత్తుల నుంచి గ్రహించినవే. ‘ఐతరేయ’ ఉపనిషత్‌ నుంచి సాధింపబడిన ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే మహావాక్యం ఋగ్వేద సంబంధమైంది. యజుర్వేదానికి సంబంధించిన ‘బృహదారణ్యకోపనిషత్‌’ నుంచి గ్రహింపబడింది ‘అహం బ్రహ్మాస్మి’ అనే మహావాక్యం. ‘తత్త్వమసి‘ అనే మహావాక్యం ‘ఛాందగ్యోపనిషత్తు’ నుంచి గ్రహింపబడగా, ఇది సామవేద సంబంధమైంది. అధర్వణ వేదానికి చెందిన ‘మాండూక్యోపనిషత్తు’ నుంచి గ్రహించిన ‘అయమాత్మా బ్రహ్మ’ అనే మహావాక్యం. ఈ నాలుగింటిలో కూడా ‘తత్త్వమసి’ అనేది ప్రముఖమైంది. ‘తత్‌.. అది.. త్వం’. నీవు, ‘అసి’ అయి ఉన్నావు. ‘అది’ అంటే, పరబ్రహ్మ తత్త్వం. ఆ పరబ్రహ్మ తత్త్వమే జీవాత్మ. ‘జీవాత్మ- పరమాత్మ’ ఒక్కటే అనే సారాన్ని ఈ నాలుగు మహావాక్యాలు చెప్తున్నాయి.

మనం కంటితో చూస్తున్నా నిజానికి అది చూడలేదు. దానిలోని చూసే శక్తియే పరమాత్మ. సూర్యుని కాంతివల్లే జగత్తు తేజోపూర్ణం అవుతున్నది. ‘ఆ తేజస్సే నీవు. అంటే, జీవాత్మ’ అంటున్నాయి ఉపనిషత్తు లు. శంకరులు ఏమంటున్నారంటే, ‘భవాని-త్వం. అమ్మ, నీవు ఇరువురూ ఒక్కటే. అంటే, తన్మయ భావనను పొందడం. అంతర్యాగంలోనైనా, బహిర్యాగంలోనైనా సాధకుడు ‘సంతోషం, ఆనందం, తాదాత్మ్య త, తన్మయత’ అనే నాలుగు స్థితులను పొందుతాడు. బహిర్యాగం లేదా సగుణోపాసనలోనూ దివ్యమైన నిర్గుణభావాన్ని పొందడం సాధకునికి అవసరం. అలా, ఆ భావనను పొందితేనే అమ్మ ఆరాధన (ఉపాసన) సఫలమవుతుంది. మూలాధారంలో జాగృతమైన కుండలినీ శక్తి సహస్రారం చేరేంతవరకు అమ్మ అనుభూతులు, అనుభవాలు వివిధంగా ఉంటాయి. అవే ఋషిస్థాయి, సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య స్థితులు. సాధకుని అంతిమలక్ష్యం మరుజన్మ లేకుండా అమ్మలో లయమయ్యే సాయుజ్యాన్ని పొందడమే. అమ్మను ఉపాసించి, ఆమె కరుణా కటాక్షాల వల్ల సాయుజ్యాన్ని పొందే స్థితికి అందరమూ ఎదగాలని ఆశిద్దాం.

పాలకుర్తి రామమూర్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana