Sravana Masam | సిరులు కురిపించే శ్రీలక్ష్మి.. పసిపాపల చిరునవ్వుల్లో సంతాన లక్ష్మి… ఇల్లాలి ఆలనలో గృహలక్ష్మి.. ఇలా అష్టలక్ష్మీలను తనలో ఆవాహన చేసుకుని వరలక్ష్మీగా అవతరించిన మాసం..అవని తరించిన మాసం… శ్రావణం. ఈ శ్రావణ లక్ష్మి ఊరూరికీ ఊరికే రాదు.. ఆషాఢంలో ఊరించిన మేఘాలను.. ఉరుములు మెరుపులతో కురిపిస్తూ వస్తుంది. శ్రావణ మేఘాలు.. హర్షాతిరేకాలకు ప్రతీకలని చెబుతారు.. అందుకే శ్రావణ లక్ష్మి ఆగమించిన మాసంలో ప్రతిరోజూ ఓ వ్రతం పలకరిస్తుంది. ప్రతి వారం ఓ విశేషం కనిపిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం వెల్లువిరుస్తుంది. ప్రతి ఇల్లాలూ సౌభాగ్యలక్ష్మీగా వాయినం ఇస్తుంది.
పుణ్యాల రాశీ శ్రీలక్ష్మి. సర్వజగత్తుకు కల్పవల్లి. దారిద్య్ర నాశిని. సౌభాగ్య దాయిని. పాలసంద్రంలో పుట్టిన బంగారం ఆ తల్లి. లోకంలో కన్నీటి శోకాలను తుడిచేస్తుంది. వానజల్లులతో పన్నీటిని చిలకరిస్తుంది. లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకూ అధిదేవత. లక్ష్మి ఎవరింట ఉంటుందో.. అక్కడ శ్రీహరి కూడా కొలువుదీరుతాడు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే.. లక్ష్మి అనుగ్రహం తప్పనిసరి. సదాచార సంపన్నులు, సత్కర్మలలో పాలుపంచుకునేవాళ్లు, నీతిమంతులను అమ్మవారు అనుగ్రహిస్తుంది. వ్యసనాలకు లోబడే వారిని, మానసిక శుద్ధి లేనివారిని, దుష్టబుద్ధి కలవారిని శ్రీమహాలక్ష్మి విడిచి వెళ్లిపోతుందని జైమినీ భారతం చెబుతున్నది. అందుకే, డబ్బుకన్నా.. సద్గుణాలను ప్రసాదించమని అమ్మను ప్రార్థించాలి.
‘దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్’ అని వేదోక్తి. లోకంలోని సకల దారిద్య్రాలను పారదోలే దేవత మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలనూ నివారించే శక్తి ఆమెది. అందుకే శంకరాచార్యులు అమ్మవారిని ‘సంపత్కారిణి’ అని కీర్తించారు. ధర్మ సమ్మతమైన ఏ వరం కోరినా.. అనుగ్రహించే దైవం కాబట్టి.. శ్రావణ లక్ష్మిని ‘వరలక్ష్మి’ అని సంబోధించారు. ఆ తల్లి కరుణా కటాక్షాలను పొందడానికి ఉద్దేశించినదే ‘వరలక్ష్మీ’ వ్రతం.
అమ్మవారు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలని శాస్త్ర నియమం. వ్రతం అంటే.. అలంకారాలు, పూలు, పండ్లు ఈ తంతు కాదు. ‘వ్రతవ్యే అనేత అనయావా ఇతి వ్రతం..’ అంటే.. జీవితంలో ఒక దీక్షగా దేనిని పాటిస్తామో అది వ్రతం. సిరులిచ్చే వరలక్ష్మిని సాక్షాత్కరింపజేసుకునే అరుదైన అవకాశం ఈ వ్రతం. పూజలు, స్తోత్రాలు ఇందుకు ఉపకరిస్తాయి.
‘యా దేవీ సర్వ భూతేషు.. లక్ష్మీ రూపేణ సంస్థితా’ అని వేదోక్తి. సృష్టిలోని ప్రతి పదార్థమూ లక్ష్మీ స్వరూపమే! అయితే, ఆ పదార్థాన్ని వినియోగించుకునే బుద్ధి ఉన్నప్పుడే లక్ష్మీ సిద్ధి కలుగుతుంది. ఎండిన గట్టిపోచ నుంచి ఉష్ణశక్తిని పొందొచ్చు. వాడిన పూల నుంచి సుగంధ ద్రవ్యాలు పుట్టించొచ్చు. సృష్టిలో ప్రతి పదార్థమూ ప్రత్యేకమైన శక్తి కలిగినదే! వాటిని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్మీతత్వం. ఉదాహరణకు బంగారంతో ముచ్చటైన ఆభరణాలు చేసుకోవచ్చు.
అదే బంగారం నుంచి స్వర్ణభస్మం అనే దివ్యమైన ఔషధాన్నీ తయారు చేయొచ్చు. వేటికవే ప్రత్యేకమైనవి. లక్ష్మీదేవి సదా నిలిచి ఉండే వస్తువుల్లో స్వర్ణం కూడా ఒకటి. లౌకికంగా చూసినా.. బంగారం విలువ పడిపోయిన దాఖలాలు కనిపించవు. బంగారంపై పెట్టుబడి బంగారమంటి అవకాశంగా భావిస్తారు. అత్యవసర సమయాల్లో అరక్షణంలో బంగారంపై రుణం దొరుకుతుంది. అందుకే కాబోలు.. లక్ష్మీదేవి బంగారం రూపంలో కొలువుదీరింది.
పరిశుభ్రత ఉన్న నెలవులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దేహం మాత్రమే కాదు.. మనసూ పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ‘ప్రకృత్యై నమః’ అని స్తుతించారు. ప్రకృతిలోని ప్రతి సంపదా తనే. పాంచభౌతిక శక్తులైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. పంటపొలాల్లోనే కాదు, పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తుంది. ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మి నివాసాలని శ్రీసూక్తం చెబుతున్నది. చెట్లు నాటేవారిని ఆమె అనుగ్రహిస్తుందట. తొలి సంధ్య కిరణాల్లోని లక్ష్మీశక్తి భూమిలో ఖనిజాలను సృష్టిస్తుందని వేదమంత్రాలు చెబుతున్నాయి.
స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా ప్రకటించాడు. ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మాహాత్మ్యాన్ని 24 అధ్యాయాల్లో వివరించాడు పరమశివుడు. తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ, వెయ్యి కండ్లతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని శివుడు పేర్కొన్నాడు. అంతేకాదు, ఆదిశేషుడు వెయ్యి నాలుకలతో మహేశ్వరుడి గొప్పదనాన్ని శ్లాఘిస్తూ ఉంటాడట.
శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతివారమూ పవిత్రమైందే. ప్రతి తిథి విశేషమైందే. అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ నెలలో. వరలక్ష్మీ వత్రం, మంగళగౌరీ వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే! దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. శ్రావణమాస విశిష్టతను, వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ‘ఈ శ్రావణమాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు. ‘అర్థవాదోన చాత్రహి’ ఈ విషయాలన్నీ సత్యాలే’ అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు.
వేదాలు శ్రావణాన్ని నభో మాసమని పేర్కొన్నాయి. నభం అంటే ఆకాశమని అర్థం. వర్షాలు విశేషంగా కురిసే మాసం కావడంతో దీనిని ‘నభో మాసం’గా పిలిచారు పెద్దలు. అధిక వర్షపాతం వల్ల ప్రకృతిలోని పంచభూత శక్తులు ప్రబలంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి విపరీత పరిస్థితులూ కల్పిస్తుంటాయి. ఆ సమయంలో శరీరంలో రోగ నిరోధకశక్తి కుంటుపడుతుంది. ఫలితంగా అంటు రోగాలు విజృంభిస్తుంటాయి. అందుకే, ప్రకృతిలో వచ్చే వేర్వేరు మార్పులకు అనుగుణంగా, మన శరీరాన్ని మార్చుకునే దిశగా పలు మార్గాలు సూచించారు మన పెద్దలు. అందులో భాగంగా నిర్దేశించినవే వ్రతాలు.
శ్రావణం వచ్చిందంటే.. ఊరూరా పెండ్లిసందడి మొదలవుతుంది. జ్యేష్ఠం తర్వాత వివాహాలకు అనువైన మాసం శ్రావణమే. ఈ ఏడాది చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాలు మూఢాలు ఉండటంతో.. శ్రావణంలో వివాహ ముహూర్తాలు విశేషంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది జంటలు జట్టుకడుతున్నాయి. ఈ క్రమంలో బంగారం దుకాణాల్లో, వస్ర్తాలయాల్లో లక్ష్మీదేవి ఆనంద నర్తనం చేయనున్నది. పెండ్లి మంటపాలు, వాటిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులు, కళాకారులు అందరికీ ఈ నెల లక్ష్మీప్రదం అవుతున్నది. శుభకరమైన శ్రావణంలో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్న నవ వధూవరులు వరలక్ష్మీ అనుగ్రహం అదనంగా పొందుతారనడం ఖాయం.
కొత్తగా పెండ్లయిన ఆడపిల్లలు మొదటి ఐదేండ్ల పాటు శ్రావణమాసం మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సర్వమంగళ స్వరూపం ప్రకృతి శక్తిని ఆరాధించే విధానం మంగళగౌరీ వ్రతం. వివాహం తర్వాత స్త్రీల శారీరక ప్రకృతుల్లో వచ్చే మార్పులను సమన్వయం చేసుకోవడానికి ఈ వ్రతం ఒక అవకాశం. దాంపత్య సుఖాన్ని పెంచుకునే మార్గాన్ని సుగమం చేస్తుంది. వైవాహిక బంధం పవిత్రమై, శాశ్వతం కావడానికి ఈ వ్రతం తోడ్పడుతుంది. అంతేకాకుండా, శరీరంలో సంతాన శక్తిని పెంచుతుంది. ఇక శుక్రవారం చేసే వరలక్ష్మీ వ్రతం కష్టనష్టాల్ని రూపుమాపి.. సకల ఐశ్వర్యాలనూ ప్రసాదిస్తుంది.