తిరుపతి : కల్యాణమస్తు సామూహిక ఉచిత వివాహాల కార్యక్రమాన్ని ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఆగస్టు 7న సుముహూర్తంలో జరుగనున్న కల్యాణమస్తు కార్యక్రమం కోసం దరఖాస్తు ఫారాన్ని త్వరితగతిన తయారుచేసి ఆయా జిల్లాల యంత్రాంగానికి అందించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తిరుపతిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల న్నారు. సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పక్షాన, జిల్లా యంత్రాంగం పక్షాన చేయాల్సిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగాలకు లేఖలు రాయాలని తెలిపారు. వారితో సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం గురించి గ్రామస్థాయి వరకు తెలిసేలా ప్రచారం జరగాలని, ఎక్కువమందికి సమాచారం తెలిపేందుకు వీలుగా ఎస్వీబీసీ, ఇతర ఛానళ్లు, సోషల్ మీడియా, శ్రీవారి సేవకులు, ఇతర వాలంటీర్ల సహకారం తీసుకోవాలని అన్నారు.