హైందవ సంస్కృతిలో అన్ని పండుగలకూ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రతీ పర్వం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొని ఉంటుంది. భాద్రపద కృష్ణ పక్షంలో వచ్చే మహాలయ పక్షాలు కూడా అలాంటివే! ఈ పక్షం రోజులు పితరులను తలచు కోవాలని శాస్త్రం నిర్దేశించింది. అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథుల్లో తర్పణ, శ్రాద్ధకర్మలు ఆచరించాలని సూచించింది.
ఉత్తరాయణం దేవతల కాలమనీ, దక్షిణాయనం పితృకాలమని శాస్త్ర వచనం. ఆషాఢ మాసం కృష్ణ పక్షం మొదలు ఐదో పక్షం అంటే భాద్రపదం కృష్ణ పక్షం వరకు పితరులు చాలా కష్టపడుతూ, అన్నోదకాలు కాంక్షిస్తూ ఉంటారట. వారి క్షుద్బాధ తీర్చడానికి మహాలయ పక్షం అనువైన సమయంగా పేర్కొన్నారు.
మహాలయ పక్షంలో ‘దివే దివే గయాతుల్యమ్’ అంటే ప్రతి రోజూ తర్పణం గానీ, పితరులు దూరమైన పుణ్యతిథి నాడు శ్రాద్ధం గానీ నిర్వహించినట్టయితే పితృదేవతలు సంవత్సరం వరకు సంతృప్తులు అవుతారని స్కాందపురాణం చెబుతున్నది.
కన్య, తుల రాశుల్లో సూర్యుడు సంచరించే సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుందనీ, పితృదేవతలు అన్నం కోరుతూ వారి వారసుల ఇండ్ల చుట్టూ తిరుగుతారని మహాభారతంలో ఉటంకించారు. మహాలయ పక్షాల్లో తమ వారసులు శ్రాద్ధ కర్మలు ఆచరిస్తారని కొండంత ఆశతో ఉంటారట. వారసులు తమ యథాశక్తి శ్రద్ధగా శ్రాద్ధకర్మ ఆచరిస్తే పితరులు సంతోషించి తమ లోకాలకు వెళ్తారట. లేనిపక్షంలో వృశ్చికమాసం తర్వాత దేవతలతో సహా నిట్టూర్చి, శాపమిచ్చి తిరుగు ప్రయాణం అవుతారట.
మరణించిన వ్యక్తి తిథి నాడు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. తండ్రి మరణించిన తిథినాడు కొడుకు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతేమిటి? వారికోసం శాస్త్రం ఓ మార్గాన్ని నిర్దేశించింది.
కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదరి, సోదరులు మరణించి ఉండవచ్చు. పెళ్లయినా.. సంతానం లేక మరణించిన దంపతులూ ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు, యుద్ధాలలో ప్రాణాలు వదిలిన వాళ్లు, ఆత్మహత్య చేసుకున్నవాళ్లు, ప్రకృతి వైపరీత్యాల్లో కన్నుమూసిన వాళ్లు ఉండవచ్చు. అటువంటి వారికి తిలోదకాలు ఇచ్చి.. వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం నిర్దేశించినవే మహాలయపక్షాలు.
కాలం చేసిన వంశస్థులతోపాటు, పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు కూడా మహాలయ పక్షాల్లో తిలోదకాలతో పిండప్రదానం చేసే అర్హత, అధికారం కర్తకు ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణంతోనైనా… తద్దినం పెట్టకపోతే.. ఆ దోషం మహాలయ పక్షాల్లో పితృవిధి నిర్వర్తిస్తే తొలగిపోతుందంటారు. ఈ పక్షాల్లో పితృదేవతలు ఆశతో తమ వారసుని ఇంటిని ఆవహించి ఉంటారని నమ్ముతారు. పితృవిధి నిర్వర్తించిన వారసుడిని మనసారా ఆశీర్వదించి, పిల్లాపాపలతో
సంతోషంగా జీవించమని దీవిస్తారట.