గ్రంథ మభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః
పలాలమివ ధాన్యార్థీ త్యజేత్ గ్రంథ మశేషతః
(అమృతబిందు ఉపనిషత్తు)
‘మేధావి అయినవాడు వేద శాస్ర్తాలను నేర్చుకొని, జ్ఞాన విజ్ఞానాల పట్ల మంచి ప్రయత్నం కలవాడై ఉండాలి. ధాన్యాన్ని కోరేవాడు పొట్టును వదిలిపెట్టి బియ్యాన్ని తీసుకునేటట్టుగా వేద శాస్ర్తాలను అన్నిటిని విడిచిపెట్టాలి…’ అని భావం. అంటే జ్ఞానాన్ని స్వీకరించి భద్రపరుచుకుని, పుస్తకాల మీద వ్యామోహాన్ని వదిలి పెట్టాలి అని శ్లోక తాత్పర్యం. ఈ భావాన్ని ప్రతిబింబించే కథను రామకృష్ణ పరమహంస ఇలా ప్రవచించారు.
‘ఒక వ్యక్తికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో అతని బంధువు కొన్ని వస్తువులు కొని పంపమని రాశాడు. ఉత్తరం చదివిన వ్యక్తి వాటిని తీసుకువద్దామని బజారుకు బయల్దేరాడు. కానీ, ఉత్తరాన్ని ఎక్కడో పెట్టి మరచిపోయాడు. వస్తువుల వివరాలూ గుర్తులేవు.
ఉత్తరం కోసం ఆత్రుతగా వెతికాడు. ఇంట్లో వాళ్లూ వెతికారు. ఆఖరికి ఒకచోట ఉత్తరం దొరికింది. హమ్మయ్య అనుకుంటూ ఆనందించాడు. మళ్లీ గబగబా చదివాడు. 5 సేర్ల మిఠాయి, ఒక వస్త్రం, ఇంకా ఏవో వస్తువులు పంపమని అందులో రాసి ఉంది. చెయ్యవలసిన పని తెలిసిపోయింది. ఇక బజారుకు వెళ్లి సేకరించి పంపడమే!’ ఈ కథను శశిధర పండితుడికి, గిరీశ్చంద్ర ఘోష్‌కు చెప్పిన రామకృష్ణులు ‘శాస్ర్తాలలో భగవంతుణ్ని దర్శించే మార్గం మాత్రమే చెబుతారు.
అది తెలుసుకున్న తరువాత అతణ్ని పొందడానికి సాధన చేయాలి. గమ్యం చేరాలి. అంతేకాని, కేవలం పాండిత్యం వల్ల ఏం ప్రయోజనం? పుస్తకాలు కంఠస్థం చేయడం, చెప్పడం.. అంతేనా! మనసు లోపల కామినీ కాంచనాల కోసం ఆరాటం. దీనివల్ల తరించిపోవడం జరుగుతుందా! శాస్ర్తాల అంతరార్థాన్ని అవగాహన చేసుకోలేదని తేలిపోతున్నది గదా! వేదాలు, తంత్రాలు, షడ్దర్శనాలు చదవడం వల్ల, విషయం తెలుసుకోవడం వల్ల మాత్రమే భగవంతుడిని తెలుసుకోలేం. వాటితో భగవత్ అనుభూతి కలుగదు. కావలసింది తీవ్ర వైరాగ్యం, ఆధ్యాత్మిక సాధన మాత్రమే!’ అని తత్వాన్ని విశదీకరించారు పరమహంస.
– డా॥ వెలుదండ సత్యనారాయణ