గురువారం 04 జూన్ 2020
Devotional - Apr 01, 2020 , 21:29:36

రామనామ మహిమ

రామనామ మహిమ

‘శ్రీరామ’ నామము భరతజాతికి ప్రతిధ్వని. రామనామం తెలియని భారతీయుడు గానీ, పల్లెగానీ ఉండవు. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి శ్రీరాముని జన్మదినం. ఆ రోజు రామనా మ స్మరణతో దేశమంతా మార్మోగుతుంది. భక్తి ప్రపత్తులతో జన్మదిన వసంతోత్సవాలు, శ్రీ సీతారామ కల్యాణాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఆచరిస్తారు. ఈ సందర్భంగా బెల్లం, పాన కం, వడ పప్పు ప్రసాదాలు పంచిపెట్టడం, అన్నదానాలు జరుగుతుంటాయి.

భారతీయ సంస్కృతికి గుండె, మెదడు వంటివి భారత, రామాయణ ఇతిహాసాలు. ప్రజల కష్టసుఖాలతో, ఆధ్యాత్మిక చింతనతో పెనవేసుకున్నది రామాయణం. రామనామ సత్ఫలంతో తెలిసీ తెలియని పాపాలన్నీ పటాపంచలవుతాయి. పుణ్యలోకాల ప్రాప్తికి రామనామమే పరమౌషధం. ‘భర్జ నం భవ బీజానాం ఆర్జనం సుఖసంపదాం/ తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం’. దుష్టశిక్షణ, శిష్టరక్షణకోసం విష్ణుమూర్తి మానవుడిగా ఎత్తిన అవతారమే శ్రీ రామచంద్రమూ ర్తి. రాముడు ధీరోదాత్తుడైన నాయకు డు. రెండు మాటలు చెప్పడు. ద్వంద్వ వైఖరి లేదు. ధైర్య సాహసాలకు ప్రతిబింబం. మిత హిత సత్య వాక్పరిపాలకుడు.

ఆది కవి వాల్మీకి రాముని చరిత్రను, గుణగణాలను 24,000 శ్లోకాలు, ఆరుకాండలలో పొందుపరిచాడు. రామాయణ కాలంలోనే వాల్మీకి జీవించి, ప్రత్యక్ష అనుభవాలను పొందాడు. తన జీవిత చరమాంకంలో సీతమ్మకు ఆశ్రయమిచ్చాడు. లవకుశుల గొంతు ద్వారా రాముని గొప్పతనాన్ని లోకానికి వాల్మీకి చాటినట్లు కూడా వాడుకలో ఉన్నది. బ్రహ్మదేవుని వద్దకు వెళ్లిన వాల్మీకి, ‘రెం డు పక్షుల జంటలో ఒక పక్షి వేటగాడి దెబ్బతో చనిపోవడం’ వల్ల తాను ఆవేదన చెందిన వైనాన్ని చెప్తాడు. అప్పుడు అనుష్టుపు ఛందస్సుతో కూడిన శ్లోకం వాల్మీకి నోట జాలువారుతుంది. వాల్మీకి బ్రహ్మదేవుడిని ఓదార్పు కోరుతాడు. దానికి విచారించిన బ్రహ్మ, ‘ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢ వ్రత:/ చారిత్రే దుచకోయుక్త: సర్వభూతేషు కోహిత:’ అంటాడు.‘లోకంలో గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు కలవాడు, దృఢవ్రతుడు, యోగ్యమైన ప్రవర్తనాపరుడు, సర్వభూత హితాత్ముడు, ద్యుతిమంతుడు అయిన నాయకుని గుణవర్ణన చేయమని సూచించాడు. ‘ఇన్ని అర్హతలున్నది ఒక్క శ్రీరామచంద్రుడికి మాత్రమేనని’ వాల్మీకి తెలుసుకొంటాడు. అలా.. పౌలత్యవథ, సీతాయాక్చరితం, రామాయణం పేర్లతో రచనకు పూనుకుంటాడు.

ఎన్నో వరాలు పొందిన రావణబ్రహ్మ చేసే అరాచకాలు భరించలేక దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తారు. విష్ణుమూర్తిని మానవ అవతారం ఎత్తమని ప్రార్థిస్తారు. రావణుడు ‘మానవునివల్ల చావు రాకూడదని’ కోరుకోలేదు. కాబట్టే, విష్ణువు శ్రీరాముని అవతారం దాల్చడానికి అంగీకరిస్తాడు. అయోధ్య రాజ్యాధిపతి దశరథుడు ఋష్యశృంగు ని ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం జరిపిన అనంత రం పుత్ర కామేష్ఠి యాగాలు చేస్తాడు. అప్పుడు కృష్ణవర్ణంలో, ఎర్రని వస్ర్తాలతో, పాయసపాత్రతో అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆనందంతో ఆ పాయసాన్ని దశరథుడు సగభాగం కౌసల్యకు ఇచ్చేసి, మిగిలిన భాగం కైకేయి, సుమిత్రలకు అందిస్తాడు. ఫలంగా వసంతఋతువులో చైత్రశు ద్ధ నవమి మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో ఐదు పెద్దగ్రహాలు (రవి, కుజ, గురు, శుక్ర, శని) ఉచ్ఛస్థానంలో ఉండగా, కర్కటక లగ్నంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తాడు. పుష్యమి నక్షత్రంలో దశమినాడు మీన లగ్నంలో కైకేయికి భరతుడు ఉదయిస్తా డు. ఆశ్లేష నక్షత్రంలో కర్కటక లగ్నంలో సుమిత్రకు లక్ష్మణ-శత్రుఘ్నులు జన్మిస్తారు.

సర్వసద్గుణ సంపన్నుడు శ్రీరాముడు. పరిపాలన భరించేవాడు భరతుడు. దాస్యసేవకు డు లక్ష్మణుడు, శత్రుసంహారకుడు శత్రుఘ్ను డు. మరోవైపు బ్రహ్మవరం వల్ల వివిధ దేవత లు భల్లూక వానరులుగా, సేనలుగా జన్మించి రాముడికి సేవలు అందిస్తారు. ఆంజనేయు డు నమ్మిన బంటుగా, దాసునిగా నిరంతరం రాముణ్ణి గుండెలో పెట్టుకొని సేవించాడు. మహత్తరమైన రామనామ మహిమను శంకరుడు పార్వతీదేవితో విష్ణుసహస్ర నామాల సందర్భంలోనూ చెప్పించడం విశేషం. ‘శ్రీరామరామేతి రమేరామే మనోరమే/ శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’. మహాభారతంలో భీష్మ-యుధిష్ఠిర సంవాదం సందర్భంలో, స్కాందపురాణంలోనూ వ్యాసుడు ఐదు అధ్యాయాలుగా రామనామ మహిమను వర్ణించాడు.


logo