బంజారాహిల్స్ : షాపింగ్ మాల్లో బట్టలు కొనేందుకు వెళ్లిన యువతి ట్రయల్ కోసం డ్రెస్ మార్చుకుంటుండగా సెల్‌ఫోన్‌తో వీడియో తీసిన ఇద్దరు యువకులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ మేనేజర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్నగర్లోని అమూల్యా రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కిరీట్ అసాట్ (24) అనే యువకుడికి వెంగళ్రావునగర్లో నివాసం ఉంటున్న రియల్ఎస్టేట్ సంస్థ అధిపతి కొడుకు కన్నెగంటి గౌరవ్ కల్యాణ్ (19)తో స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని ఎమ్ అండ్ ఎమ్ మల్టీనేషనల్ బ్రాండ్ స్టోర్‌కు షాపింగ్ కోసం వెళ్లారు.
అదే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వచ్చిన ఓ యువతి కొన్ని డ్రెస్‌లను ఎంపిక చేసుకుని వాటిని ట్రయల్ చూసేందుకు అక్కడే ఉన్న ట్రయల్ రూమ్‌కు వెళ్లింది. అదే ఫ్లోర్లో షాపింగ్ చేస్తున్న కిరీట్ అసాట్, గౌరవ్ కల్యాణ్‌లు పక్కనే ఉన్న మరో ట్రయల్ రూమ్‌లోకి వెళ్లారు. తక్కువ ఎత్తున్న పార్టిషన్ మీదుగా సెల్‌ఫోన్ పెట్టిన కిరీట్ లోపల బట్టలు మార్చుకుంటున్న యువతి వీడియో తీశాడు.
కాసేపటి తర్వాత తలపైకెత్తి చూసిన యువతి సెల్ఫోన్లో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు పెడుతూ బయటకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని స్టోర్ సిబ్బందికి చెప్పగా వారు నిందితులను పట్టుకున్నారు.వెంటనే బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పగా క్షణాల్లో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
బాధితురాలితో మాట్లాడి వివరాలను సేకరించడంతో పాటు సంఘటనకు కారణమయిన కిరీట్, గౌరవ్ కల్యాణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వీడియో తీసిన కిరీట్ అసాట్, గౌరవ్ కల్యాణ్‌తో పాటు సరైన భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం కనబర్చిన ఎచ్ అండ్ ఎమ్ స్టోర్ మేనేజర్ అమన్ సూరిలపై ఐపీసీ 354(సి),509రెడ్‌విత 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.