బెంగళూరు: భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర పన్నింది. అయితే ఆమె భర్తను హత్య చేసినట్లుగా కిరాయి వ్యక్తులు నమ్మించారు. వారు పంపిన ఫొటోలు చూసి భయపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు పోలీసులకు భర్త అసలు విషయం చెప్పడంతో ఆ మహిళ, ఆమె తల్లితోపాటు ముగ్గురు కిరాయి వ్యక్తులను అరెస్ట్ చేశారు. క్రైమ్ సీరియల్‌ను తలపించేలా ఉన్న ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
26 ఏళ్ల అనుపల్లవి, నవీన్ కుమార్ దంపతులు పీణ్య సమీపంలోని దొడ్డబిదరకల్లులో నివసిస్తున్నారు. అయితే హిమవంత్ కుమార్ అనే వ్యక్తి, అనుపల్లవి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో క్యాబ్ డ్రైవర్ అయిన భర్త నవీన్ కుమార్ అడ్డు తొలగించుకునేందుకు వారు ప్లాన్ వేశారు. అనుపల్లవి తల్లి కూడా దీనికి సహకరించింది. నవీన్ హత్య కోసం హరీష్, నాగరాజు, ముగిలన్ అనే ముగ్గురు కిరాయి వ్యక్తులను రెండు లక్షలకు మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ కింద రూ.90,000 ఇచ్చారు. నవీన్ హత్య తర్వాత మిగతా డబ్బు ఇస్తామని చెప్పారు.
కాగా, జూలై 23న హరీష్, అతడి ఇద్దరు అనుచరులు కలిసి నవీన్ కుమార్‌ను కిడ్నాప్ చేశారు. అతడ్ని తమిళనాడుకు తీసుకెళ్లారు. అయితే నవీన్‌ను చంపేందుకు వారికి ధైర్యం చాల్లేదు. దీంతో అతడితో కలిసి కుమ్మక్కయ్యారు. మరోవైపు పని అయ్యిందా అంటూ అనుపల్లవి, హిమవంత్ కుమార్ వారికి ఫోన్ చేశారు. దీంతో నవీన్ శరీరంపై టమాటో గుజ్జు వేసి రక్తం మాదిరిగా ఫొటోలు తీసి చంపేశామంటూ వారికి పంపారు. అయితే ఆ ఫొటోలు చూసిన హిమవంత్ కుమార్, పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
మరోవైపు నవీన్ కుమార్ కనిపించకపోవడంతో అతడి సోదరి ఆగస్ట్ 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడు ఈ నెల 6న బెంగళూరుకు తిరిగి వచ్చాడు. పోలీసులను కలిసి జరిగిదంతా చెప్పాడు. దీంతో అనుపల్లవి, హిమవంత్ కుమార్ మొబైల్ ఫోన్లను పోలీసులు పరిశీలించారు. నవీన్ కుమార్ హత్యకు కుట్ర పన్నినట్లు నిర్ధారణ కావడంతో భార్య, సహకరించిన అత్త అమ్మోజమ్మతోపాటు కిరాయి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.