లక్నో: తన కుమార్తెను కాపాడుకునేందుకు ఒక మహిళ ధైర్యం చేసి చిరుతపులితో పోరాడింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నాన్పారా అటవీ ప్రాంతంలోని ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్దా గ్రామంలోకి ఒక చిరుత ప్రవేశించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేండ్ల కాజల్ అనే బాలికపై దాడి చేసింది. నోట కరుచుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. ఇంటిని ఊడ్చుతున్న తల్లి రీనా, కుమార్తె అరుపులు విని వెంటనే అప్రమత్తమైంది. కర్ర చేతపట్టుకుని బయటకు వచ్చి చిరుతను కొట్టింది. దీంతో అది ఆ పాపను వదిలిపెట్టి పారిపోయింది.
కాగా, చిరుత దాడిలో బాలిక తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారిని తొలుత స్థానిక శివపురిలోని ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ సిఫార్సుతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు బాలికపై చిరుత దాడి గురించి అటవీశాఖ అధికారులు తెలుసుకున్నారు. వన్యప్రాణి రేంజర్ రషీద్ జమీల్, అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనవాసాల్లోకి వచ్చిన చిరుతను బంధించి తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.