చండీగఢ్: ఆటోలో వెళ్తున్న మహిళ చేతిలోని మొబైల్ ఫోన్‌ను బైక్‌పై వెళ్తున్న స్నాచర్ లాక్కున్నాడు. ప్రతిఘటించిన ఆమె ఆటో నుంచి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడింది. దేశ రాజధాని ఢిల్లీ శివారులోని హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల కిరత్ కౌర్ కౌసర్, సెక్టార్ 56లో నివాసం ఉంటున్నది. గత ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆఫీస్ తర్వాత ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఒక దొంగ బైక్‌పై ఆ ఆటోను ఫాలో అయ్యాడు. కౌర్ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు.
కాగా, ఆ స్నాచర్‌తో ప్రతిఘటించేందుకు కౌర్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఆమె పడింది. అయితే ఆ దొంగ ఆమె మొబైల్ ఫోన్‌తో పారిపోయాడు. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన ఆ మహిళను ఆటో డ్రైవర్ ఆమె ఇంటికి చేర్చాడు. అనంతరం కౌర్ తండ్రి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
మరోవైపు రెండు రోజులు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న కౌర్, బుధవారం ఈ సంఘటనపై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆటో నుంచి రోడ్డుపై పడిన సమయంలో వెనుకగా ఇతర వాహనాలు లేవని, లేకపోతే ఆ వాహనాలు తన మీదుగా వెళ్లేవంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, కౌర్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజ్ ద్వారా బైక్ స్నాచర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.