మర్పల్లి : అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దామస్తాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటశ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామస్తాపూర్ గ్రామానికి చెందిన తలారి వెంకటేశం (35) అప్పుల బాధతో పాటు కడుపునొప్పి భరంచలేక గురువారం ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగులు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మర్పల్లి దవాఖానకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి దవాఖానకు తరలించారు.
అక్కడ నుంచి నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు తెలిపారు. వెంకటేశం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు.