ముంబై : ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన పని చేస్తున్న రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ముంబైలోని తిలక్‌నగర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్లో విమలేశ్ కుమార్ అనే వ్యక్తి డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఆయనను గతేడాది చివర్లో లక్నో నుంచి ముంబైకి బదిలీ చేశారు. ఈ క్రమంలో విమలేశ్.. రెండు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే మార్చి 31వ తేదీ వరకు ఉద్యోగం చేయాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విమలేశ్ మంగళవారం ఉదయం తాను పని చేస్తున్న రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
త న భర్త పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని విమలేశ్ భార్య ఆరోపించింది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే విమలేశ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.