ముంబై: మహిళను కత్తితో బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రూ.21.25 లక్షల విలువైన వస్తువులను దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన జరిగింది. సోమవార్ పేట్ సదానంద్ నగర్‌లోని అమర్ సెంటర్ హౌసింగ్‌లో జ్యోత్న బోరా అనే మహిళ నివాసం ఉంటున్నది. ఆమె భర్త బట్టల వ్యాపారి. ఇటీవల తన ఆధార్ కార్డ్ చిరునామాను ఆమె అప్డేట్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆధార్ కార్డు డెలివరీ పేరుతో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. డోర్ తెరిచిన ఆ మహిళపై దాడి చేసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె ఒంటరిగా ఉండగా మెడ వద్ద కత్తి ఉంచి బెదిరించారు. ఇంట్లోని రూ.21.25 లక్షల విలువైన వస్తువులను దోచుకుని పారిపోయారు.
ఈ షాక్ నుంచి తేరుకున్న జ్యోత్న తన పొరుగింటి వారికి జరిగిన విషయం చెప్పింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.