శుక్రవారం 15 జనవరి 2021
Crime - Sep 25, 2020 , 14:36:23

గిరిజన గ్రామాల్లో ఘర్షణ.. పలు ఇండ్లు ధ్వంసం

గిరిజన గ్రామాల్లో ఘర్షణ.. పలు ఇండ్లు ధ్వంసం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన గ్రామాల్లో జరిగిన మతపరమైన వేడుకలు ఘర్షణకు దారితీశాయి. దీంతో కొండగావ్ జిల్లా గ్రామాల్లో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. బస్తర్‌ డివిజన్‌లోని కాకదాబేద, సింగన్‌పూర్, సిలాటి గ్రామాల్లో గిరిజన ప్రజలు ఉంటున్నారు. ఇందులో కొన్ని కుటుంబాలు కొన్ని ఏండ్లుగా క్రిస్టియన్‌ మతాచారాన్ని పాటిస్తున్నాయి. అయితే వీరిపై స్థానిక గిరిజన పెద్దలు మండిపడుతున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మతపరవైన కార్యక్రమాలను క్రిస్టియన్‌ కుటుంబాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా ఘర్షణ జరిగింది. గిరిజన గ్రామస్తులు కొందరి ఇండ్లను ధ్వంసం చేశారు. మంగళవారం, బుధవారం ఆ గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో ఆ గ్రామాల్లో పోలీసులను ఏర్పాటు చేశారు.

కాగా కొన్ని క్రిస్టియన్‌ కుటుంబాల వారు ప్రాణ భయంతో గ్రామాలను వీడి రాయ్‌పూర్‌కు పారిపోయారని క్రిస్టియన్‌ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే వారి ఇండ్లను ధ్వంస చేశారని విమర్శించారు. దీనిపై కేసు నమోదు చేసి రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.అయితే గిరిజన భూముల వివాదాల వల్లే రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగినట్లు కొండగావ్ ఎస్పీ సిద్ధార్థ్‌ తివారీ తెలిపారు. ఈ ఘర్షణ జరిగినప్పుడు పోలీసులు అక్కడ లేరని ఆయన చెప్పారు. మరోవైపు ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరించినట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి