భోపాల్: ప్రేమను తిరస్కరించిందన్న పగతో ప్రియురాలి స్కూటీకి నిప్పుపెట్టాడు. మంటలు బిల్డింగ్‌కు వ్యాపించి ఆమె ప్రాణాలతో బయటపడగా ఇతరులైన ఏడుగురు సజీవ దహనమ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం తెల్లవారుజామున ఒక బిల్డింగ్‌కు మంటలు వ్యాపించడంతో అందులో నివాసం ఉంటున్న కొన్ని కుటుంబాలకు చెందిన ఏడుగురు మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు. సుమారు వంద సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు ఈ బిల్డింగ్‌కు నిప్పు పెట్టిన నిందితుడ్ని గుర్తించి శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.
ఝాన్సీకి చెందిన 28 ఏండ్ల శుభమ్ దీక్షిత్ అలియాస్ సంజయ్‌కు, స్వర్న్బాగ్ కాలనీలోని భవనంలో తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న ఒక మహిళతో పరిచయం ఉంది. అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఇటీవల మరో వ్యక్తితో ఆ మహిళకు పెళ్లి నిశ్చియమైంది. దీంతో సంజయ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో ఇచ్చిన తాను రూ.10,000 తిరిగి ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆ మహిళకు ఫోన్ చేశాడు. డబ్బుల విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో సంజయ్ ఆమెను తీవ్రంగా హెచ్చరించాడు.
అనంతరం శనివారం తెల్లవారుజామున 2.55 గంటలకు సంజయ్ ఆ బిల్డింగ్‌లోకి వచ్చాడు. ఒక బైక్ నుంచి పెట్రోల్ తీసి ఆ మహిళ స్కూటీపై పోసి దానికి నిప్పంటించాడు. ఆ మంటలు పక్కనున్న ఇతర బైకులు, కార్లకు వ్యాపించడంతో పెద్ద అగ్ని ప్రమాదానికి దారి తీసింది. దీంతో ఆ బిల్డింగ్‌లోని అద్దె ఇళ్లలో నివసిస్తూ నిద్రిస్తున్న వారిలో ఏడుగురు చనిపోగా తొమ్మిది మంది గాయపడ్డారు.
ఈ బిల్డింగ్‌లో అద్దెకు ఉంటూ పక్కనే ఇంటిని నిర్మించుకుంటున్న దంపతులు, ఝాన్సీకి చెందిన కాలేజీ విద్యార్థి, ఒక ఉద్యోగిని, బార్లో పని చేసే వ్యక్తి, బస్ డిపోలో పని చేసే మరో వ్యక్తి ఈ మంటల్లో కాలి చనిపోయారు. తొమ్మిది మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే సంజయ్ ప్రియురాలైన ఆ మహిళ, ఆమె తల్లి తాడు సహాయంతో మంటల నుంచి క్షేమంగా బయటపడ్డారు.
కాగా, ఏడుగురి మరణానికి కారణమైన సంజయ్ ఆ భవనంలోని సీసీటీవీలను, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. మహిళ స్కూటీకి నిప్పుపెట్టిన అతడు ఏం జరుగుతుందో అని కొంతసేపు అక్కడ ఉండి చూశాడు. మంటలు ఇతర వాహనాలకు అంటుకుని బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో రోడ్డుపై పడి గాయపడ్డాడు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సుమారు వంద సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు వెంటనే నిందితుడు సంజయ్‌ను గుర్తించారు. లోహమండి ప్రాంతంలో ఉన్న అతడ్ని శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు కోసం పోలీస్ రిమాండ్ కోరుతామని ఇండోర్ పోలీస్ కమిషనర్ హెచ్ఎన్ మిశ్రా తెలిపారు. నిందితుడిపై ఢిల్లీలో కూడా పలు కేసులు ఉన్నాయన్నారు.