న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఐజీఐ) సమీపంలోని హోటల్స్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు (ఐజీఐ విభాగం) రట్టు చేశారు. ఈ ఘటనలో వ్యభిచార రాకెట్ ప్రధాన సూత్రధారి, యువతితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని హోటళ్లలో సెక్స్ దందా సాగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఏరోసిటీ ప్రాంతానికి చేరుకున్న పోలీసుల ప్రత్యేక బృందం నవీన్‌గా గుర్తించిన ఏజెంట్ వద్దకు డెకాయ్ కస్టమర్‌ను పంపింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల బృందం హోటల్ హాలిడే ఇన్‌లో రూం బుక్ చేసింది. కస్టమర్ వేచిచూస్తున్న హోటల్‌కు నవీన్ ఓ యువతిని పంపగా అతడు పోలీసులకు సమాచారం అందించాడు. హోటల్ వెలుపల నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.
నవీన్ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు హోటళ్లలో చీకటి దందా సాగిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఈ ముఠా కస్టమర్లకు సోషల్ మీడియా వేదికలపై యువతుల ఫోటోలను పంపుతూ కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి వారు కోరుకున్న ప్రాంతాలకు యువతులను చేరవేస్తున్నట్టు తెలిసింది.