ముంబై: ఒక వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి అతడి మృతదేహాన్ని కిందకు విసిరేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. అంబోలి ప్రాంతానికి చెందిన 54 ఏండ్ల శాంతనుకృష్ణ శేషాద్రి తన అపార్ట్మెంట్ అంతస్తు నుంచి కింద పడి చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య, కుమారుడ్ని ఆరా తీయగా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఆయన సూసైడ్‌కు ప్రయత్నించినట్లు చెప్పారు.
కాగా, పోలీసులు ఆ వ్యక్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ వ్యక్తిని హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మృతుడి భార్య, కుమారుడు అబద్ధం చెబుతున్నారని పోలీసులు గ్రహించారు. కుటుంబ గొడవల వల్ల అతడ్ని హత్య చేసి ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.
దీంతో ప్రాథమిక ఆధారాలతో మృతుడి భార్య, కుమారుడ్ని అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ షింగే తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.