న్యూయార్క్ : ఇంటర్నెట్ ప్రపంచంలోకి తొంగిచూసే చిన్నారులపై ఆన్లైన్ మాయాజాలం ఎలాంటి వల విసురుతున్నదో చూస్తూనే ఉన్నాం. తాజాగా 8 ఏండ్ల బాలుడు ఏకంగా ఏకే47ను డార్క్ వెబ్ నుంచి ఆర్డర్ చేసినట్టు స్వయంగా అతడి తల్లి వెల్లడించడం కలకలం రేపుతోంది. తన కొడుకు సైబర్ క్రైమ్‌లో ఎలా కూరుకుపోయాడో నెదర్లాండ్స్‌కు చెందిన బార్బార జెమెన్ తెలిపింది. తనకు తెలియకుండా తన కొడుకు డార్క్ వెబ్ నుంచి ఏకే 47 సహా పలు ప్రమాదకర ఆయుధాలు, వస్తువులను రహస్యంగా కొనుగోలు చేశాడని వాపోయింది.
బార్బార ప్రస్తుతం హెచ్ఆర్ నిపుణురాలిగా పనిచేస్తోంది. యూరోన్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఎనిమిదేండ్ల కొడుకు ఘనకార్యాలను బయటపెడుతూ తన గోడు వెళ్లబోసుకుంది. తన కొడుకు కంప్యూటర్‌పై అధిక సమయం వెచ్చించడంతో పాటు పసి ప్రాయంలోనే హ్యాకింగ్ మొదలు పెట్టాడని తెలిపింది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా చెడు స్నేహాలకు అలవాటుపడి ఆపై వారికి అక్రమ నగదు లావాదేవీలు చేయడంలో సాయపడేవాడని చెప్పుకొచ్చింది. పిజ్జాలు ఆర్డర్ చేయడంతో మొదలుపెట్టి డార్క్‌వెబ్‌లో సీక్రెట్‌గా మారణాయుధాలను ఆర్డర్ చేసే వరకూ తెగించాడని తెలిపింది.
తమ ఇంటికి ఓరోజు ఏకే-47 గన్ రావడంతో షాక్ అయిన బార్బారా పరిస్ధితి ఎంతలా దిగజారిందో అర్ధం చేసుకుంది. గన్ను స్ధానిక పోలీసులకు బార్బారా అప్పగించింది. తన కొడుకుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఊపిరిపీల్చుకుంది. కొడుకు ప్రవర్తనలో మార్పులను పసిగట్టింది. రాత్రిళ్లు మేల్కొనే బాలుడు అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో పనిచేసేవాడని గుర్తించింది. సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను తానే నేర్చుకుని కొడుకును గాడిన పెట్టేందుకు బార్బరా సన్నద్ధమైంది. పిల్లలకు మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు దూరంగా ఉంచాలని లేకుంటే వారికి ఏది చట్టబద్ధమో, ఏది చట్టవిరుద్ధమనే విషయాలు తెలియక చెడు దారిన పట్టే ప్రమాదం ఉందని బార్బరా హెచ్చరిస్తోంది.
Read More :