లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై అరాచకాలకు అడ్డుకట్టపడటం లేదు. బదౌన్ జిల్లాలో ఇటీవల అదృశ్యమైన యువతి(21) అనుమానాస్పద స్ధితిలో వ్యవసాయ క్షేత్రంలో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. మృతదేహం పక్కనే పడిఉన్న ఆమె బ్యాగ్‌లో రూ 85,000 నగదు, ఆధార్ కార్డు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ పాస్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆమె కుల దురహంకార హత్యకు గురవడం లేదా ఆమెతో పాటు ఉన్న బాయ్‌ఫ్రెండ్ హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. కుమార్తె అదృశ్యమైనా ఆమె తండ్రి పోలీసులకు, స్ధానికులకు ఎలాంటి సమాచారం చేరవేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యువతి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.