లక్నో : తమకు ఇష్టం లేని వ్యక్తితో సోదరి లవ్ మ్యారేజ్‌ను అంగీకరించని వ్యక్తి ఆమె భర్తను కాల్చిచంపిన ఘటన యూపీలోని మీరట్‌లో సోమవారం వెలుగుచూసింది. మృతుడిని సర్దానాలోని గలి ఖటికన్ నివాసి జాకీ (25)గా గుర్తించారు. తల్లితండ్రులు, సోదరుడు అన్షు ఇష్టానికి వ్యతిరేకంగా యువతి జాకీని కొద్దినెలల కిందట పెండ్లి చేసుకుంది.
పెండ్లి అనంతరం కొత్త జంటను యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు బెదిరించినట్టు సమాచారం. జాకీతో పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి సంబంధం గిట్టని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. సోమవారం ఉదయం యువతి కుటుంబ సభ్యులు జాకీ ఇంట్లోకి చొరబడి అతడిపై కాల్పులు జరిపారు.
జాకీ మరణించిన అనంతరం అన్షు అతడి తల నరకడంతో పాటు సోదరిపైనా దాడి చేశాడు. దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. యువతి అరుపులు విన్న స్ధానికులు ఘటనా స్ధలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అన్షును అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.