ముంబై : తనతో కలిసిఉండేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ (23) పేరుతో నకిలీ వివాహ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (37)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణే గోర్పాడి ప్రాంతంలో వెలుగుచూసింది. మహిళ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో నిందితుడు ఆమె పేరిట సోషల్ మీడియాలో నకిలీ పెండ్లి ప్రకటన పోస్ట్ చేశాడు.
నిందితుడు, బాధితురాలు ఒకరికి మరొకరు పరిచయస్తులని పోలీసులు తెలిపారు. వివాహితుడైన నిందితుడు తరచూ యువతి వెంటపడుతూ తనతో కలిసి ఉండాలని ఒత్తిడి తెచ్చేవాడు. దీనికి నిరాకరించిన యువతి తాను మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది. తన ప్రతిపాదనను యువతి తోసిపుచ్చడంతో ఆమె పేరుతో సోషల్ మీడియాలో నకిలీ వివాహ ప్రకటన పోస్ట్ చేశాడు.
యువతి విడాకులు తీసుకుందని, ఆమె 45 ఏండ్లు పైబడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని అనుకుంటోందని ఆ యాడ్లో పేర్కొన్నాడు. యువతి బంధువులు, ఇతరులు ఈ ప్రొఫైల్ను చూసి ఆమెను ప్రశ్నించడంతో నిందితుడిని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.