న్యూఢిల్లీ : ప్రజల్లో పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ స్కామర్ల చేతిలో పలువురు మోసపోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో థానేకు చెందిన ఓ వ్యక్తి ఫోన్లో ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న కొద్దిసేపటికే తన ఖాతా నుంచి రూ . 5 లక్షలు పోగొట్టుకున్నాడు.
సాంకేతిక అంశాల్లో సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ ప్రొఫెషనల్స్ దూర ప్రాంతాల్లోని తమ క్లైంట్ డివైజ్‌ల యాక్సెస్ పొంది ఆయా అంశాలను పరిష్కరిస్తుంటారు. అయితే ఈ ఘటనలో థానేకు చెందిన వ్యక్తి ఫోన్‌కు యాక్సెస్ పొందిన స్కామర్ ఆపై బాధితుడి బ్యాంక్ ఖాతాల యాక్సెస్‌తో ఖాతా నుంచి పెద్దమొత్తంలో నగదు కాజేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు తన టీవీ డిస్ప్లే సరిగ్గా లేకపోవడంతో టీవీ చానెల్ ప్రొవైడర్‌కు కాల్ చేసేందుకు ప్రయత్నించాడు.
కాల్ మాట్లాడుతున్న క్రమంలో మరో నెంబర్ నుంచి అతడికి కాల్ వచ్చింది. తాను చానెల్ ప్రొవైడర్ టీమ్‌కు చెందిన వ్యక్తినని, ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని బాధితుడిని కోరాడు. తన ఫోన్లో ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే తన ఖాతా నుంచి రూ . 5 లక్షలు గల్లంతయ్యాయని బాధితుడు గుర్తించాడు. దీంతో బాధితుడు చితల్సార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గుర్తుతెలియని వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.