అహ్మదాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ (35)పై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన యువకుడి (23) ఉదంతం గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది. నిందితుడిపై ఆదివారం రాత్రి మహిళ ఫిర్యాదు ఆధారంగా సర్ధానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు సూరత్‌లో తన భర్త, పాపతో కలిసి నివసిస్తుండగా మోతావరచా ప్రాంతానికి చెందిన లతియా ఏడాది కిందట పరిచయమయ్యాడు.
ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని దగ్గరైన లతియా మహిళను హోటల్‌కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె నగ్నచిత్రాలను తీసిన నిందితుడు వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ బరూచ్‌లోని తన సోదరి ఇంటిలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. నిందితుడి తీరుతో విసిగిపోయిన మహిళ లతియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.