ODI World Cup | వన్డే వరల్డ్ కప్-2023 టోర్నమెంట్లో తొలి సెమీ ఫైనల్ టీం ఇండియా, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగనున్నది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులకు ఒక వ్యక్తి మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక్కో టికెట్ రూ.1.20 లక్షలకు విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి పేరు రోషన్ గురుబక్షానీగా గుర్తించారు. అతడి వద్ద నుంచి రెండు టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.
రోషన్ గురుబక్షానీతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి కూడా క్రికెట్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో పాల్గొంటున్నాడని తమ విచారణలో తేలిందన్నారు. క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ టికెట్ల కొనుగోలు చేయడంలో అప్రమత్తంగా ఉండాలని ముంబై డీసీపీ ప్రవీణ్ ముండే సూచించారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన వారు భద్రతా కారణాల రీత్యా బుధవారం ఉదయమే స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్- 2023 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తో భారత్ తల పడనున్నది. ఇప్పటి వరకూ గ్రూపు దశలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీం ఇండియా విజయం సాధించింది. తొమ్మిది లీగ్ మ్యాచ్‌ల్లోనూ టీం ఇండియా గెలుపొందింది. మరోవైపు న్యూజిలాండ్.. చివరి ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.