భోపాల్ : తనను పెండ్లి చేసుకునేందుకు నిరాకరించారనే కోపంతో ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఉసురుతీసేలా ప్రేరేపించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని రెవా జిల్లా ధిహియ పదన్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 12 ఏండ్లు, 16 ఏండ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లతో రవి చతుర్వేది (24) ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
వారిని పెండ్లి చేసుకుంటానని ఒత్తిడి తెస్తుండటంతో అందుకు వారు నిరాకరించారు. తనను పెండ్లి చేసుకోకుంటే వారి అశ్లీల వీడియోలను బయటపెడతానని హెచ్చరించాడు. ఆందోళనకు గురైన బాలికలు మే 23న గుడికి వెళతామని చెప్పి బయటకు వెళ్లి ఆపై ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు బావిలో వారి మృతదేహాలు కనిపించాయి.
ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు రవి చతుర్వేది ఫోన్లో బాలికలతో అభ్యంతరకరంగా మాట్లాడుతుంటంతో బాధితురాలి సోదరుడికి ఈ విషయం తెలిసి మందలించాడు. ఆపై అక్కాచెల్లెళ్ల అశ్లీల వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించడంతో వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.