Gold Smuggling | భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రూ.33 లక్షల విలువైన బంగారం కడ్డీలను మంగళవారం అక్రమంగా రవాణా చేస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు జప్తు చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణా జిల్లా పరిధిలోని బోన్గావ్ – హకింపోర్ చెక్ పోస్ట్ వద్ద సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండటంతో బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకుని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అతడి వద్ద గల బ్యాగ్‌ను తనిఖీ చేయడంతో 511 గ్రాముల బరువు గల రెండు బంగారం కడ్డీలు దొరికాయి. వాటిపై బ్లాక్ టేప్ చుట్టి ఉంది. వీటి ఖరీదు రూ.33 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఈ బంగారం కడ్డీలు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పాడు. అతడిని సఫీకుల్ అని గుర్తించారు. జప్తు చేసిన బంగారాన్ని, అరెస్ట్ చేసిన నిందితుడ్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించామని బీఎస్ఎఫ్ 112 బెటాలియన్ అధికారులు చెప్పారు.